తెలుగువాళ్ళకు ‘కారాలంటే ఎంతో యిష్టం

తెలుగువాళ్ళకు ‘కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి.

1. మొదలు పెట్టె కారం — శ్రీకారం
2. గౌరవించే కారం —-సంస్కారం,
3. ప్రేమ లో కారం — మమకారం
4. పలకరించేకారం —-నమస్కారం,
5. పదవి తో వచ్చే కారం —అధికారం,
6. అది లేకుండా చేసే కారం—— అనధికారం,
7. వేళాకోళం లో కారం —- వెటకారం
8. భయం తో చేసే కారం —- హాహాకారం,
9. బహుమతి లో కారం — పురస్కారం,
10. ఎదిరించే కారం — ధిక్కారం
11. వద్దని తిప్పికొట్టే కారం—–తిరస్కారం,
12. లెక్కల్లో కారం — గుణకారం,
13. గుణింతం లో కారం — నుడికారం
14. గర్వం తో వచ్చే కారం —- అహంకారం,
15. సమస్యలకు కారం —– పరిష్కారం,
16. ప్రయోగశాల లో కారం——- ఆవిష్కారం,
17. సంధులలో కారం — ‘ఆ’కారం,
18. సాయం లో కారం — సహకారం
19. స్రీలకు నచ్చే కారం— అలంకారం,
20. మేలు చేసే కారం —-ఉపకారం,
21. కీడు చేసే కారం — అపకారం
22. శివునికి నచ్చే కారం —- ఓం కారం,
23. విష్ణువు లో కారం —-శాంతాకారం,
24. ఏనుగులు చేసేది — ఘీంకారం
25. మదం తో చేసే కారం — హూంకారం,
26. పైత్యం తో వచ్చే కారం –వికారం,
27. రూపం తో వచ్చే కారం –ఆకారం
28. ఇంటి చుట్టూ కట్టే కారం — ప్రాకారం,
29. ఒప్పుకునే కారం — అంగీకారం,
30. చీదరించుకునే కారం —చీత్కారం
31. పగ తీర్చుకునే కారం—- ప్రతీకారం,
32. మీ అందరికి—–నమస్కారం!

Wonderful Story…But Real

పాతకాలంలో జపానులో ఒక చిత్రమైన పద్ధతి ఉండేదట……..అదేంటంటే……… వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ……వారి పని కూడా చేసుకోలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకుని పోయి ఎతైన కొండప్రాంతాలలో వదిలి వచ్చేవారట……. వారి పని కూడా చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి……క్షీణించి చనిపోయేవారట…….ఇలాంటి కౄర మైన అలవాటు ఉండేదట……. ఒక యువకుడు కూడా తన తల్లి వయస్సుపైపడి చేతకాని స్థితిలో ఉందని ఆమెను తన బుజాలపై మోసుకుని కొండల్లో వదలేసి రావడానికి బయలు దేరాడు. మార్గమధ్యలో తన బుజంపైనున్న తన తల్లి ఏదో చేస్తున్నట్లు గమనించాడు…..చెట్టు కొమ్మలను తెంపుతూ ఉన్న తన తల్లిని ఏమీ ప్రశ్నించకుండా అలాగే వెళుతున్నాడు .

చాలా దూరం వెళ్ళాక తన తల్లిని కిందికి దింపి వెనుతిరుగుతూ తల్లిని ఇలా అడిగాడు…….. ” నిన్ను నా భుజంపై మోస్తున్నప్పుడు నువ్వు చెట్ల కొమ్మలను తుంచి ఎందుకు కింద పడేస్తూ వచ్చావు. అలా ఎందుకు చేశావో చెప్పు” అన్నాడు. దానికి ఆ తల్లి ఇలా సమాధానం ఇచ్చింది…… ” నాయనా! నేను ముసలిదాన్ని అయిపోయాను నన్ను వదిలేస్తున్నావు పరవాలేదు…….మళ్ళీ నేను తిరిగి రాకూడదు అని చాలా దూరం నన్ను తీసుకుని వచ్చావు. ఒకవేళ నువ్వు దారితప్పి ఇబ్బంది పడతావేమో అని బాధతో నీకు దారిని తెలిపే ఉద్దేశ్యంతో ఆ కొమ్మలను తెంపి దారిపొడుగునా వేస్తూ వచ్చాను.ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇల్లు చేరుతావని అలా చేశాను” ఆమ్మ ఎలా ఉన్నా………ఎక్కడ ఉన్నా దేవతే…….పిల్లల మంచే కోరుకుంటుంది తన తుది శ్వాస వరకు………ఆ తల్లి మాటలకు ఆ యువకుడికి బుద్ధి వచ్చి తన తల్లిని తనతో తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా చూసుకోసాగాడు.

మాటే మంత్రం!!!

మాటే మంత్రం!!!

పరమ హంస రామకృష్ణులు గురువులను వైద్యులతో పోల్చేవారు.
వైద్యులు మూడు రకాలంట.

మొదటి రకం – వైద్యులు జబ్బు లక్షణాలను గమనించి, మందు రాసి, అంతటితో తమ పని పూర్తి చేశామనుకుంటారు.
రెండో రకం వైద్యులు ‘మందులను జాగ్రత్తగా వాడుతున్నారా’ అని ప్రశ్నిస్తూ, కేసును సమీక్షించుకుంటూ వుంటారు.
ఇక మూడో రకం వైద్యులు ‘మందు వేసుకోకుండా జబ్బు తగ్గతుందా?’ అని కాస్తంత మందలింపుగా అడిగి, మందును బలవంతంగా నోట్లో వేస్తారు. ‘మీరు జబ్బుని ఉపేక్షిస్తే, అది మిమ్మల్ని ఉపేక్షిస్తుందనుకుంటున్నారా?’ అని కడిగేస్తారు.

గురువులు కూడా అంతే…

కొందరు గురువులు మంత్ర దీక్షతో, లేదా ప్రవచనాలతో సరిపెడతారు. (‘సిలబస్ పూర్తి చేసేశాం. ఇక మీ గొడవ మీదే’ అని ఈ కాలపు అధ్యాపకుల్లో కొంతమంది చేతులు దులుపుకున్నట్టుగా).
రెండో రకం గురువులు ‘నిక్కచ్చిగా సాధన చేయకపోతే గమ్యం చేరగలమా?’ అని హెచ్చరించి, హితవచనాల దాకా పొడిగిస్తారు.
ఇక మూడో రకం గురువులు శిష్యుణ్ణి వదలకుండా పట్టుకుంటారు. పలకరింపులేనా, హెచ్చరింపులేనా, యోగక్షేమాలేనా…! అవి కూడా చాలవు వీరికి. శిష్యుడి సంస్కారాలు, మానసిక, శారీరక అంశాలు సాధనలోని పురోగతికి అనుకూలంగా వున్నదీ లేనిదీ నిశితంగా గ్రహిస్తారు.

వాటిని ప్రజ్వలింపజేసి నిక్షిప్తమైన శక్తిని వ్యక్తం చేస్తారు. అలా అని ‘పడిపోతున్నాడు’ పాపం అని చేయందించరు. తాము నేపథ్యంలోనే వుంటారు. వాళ్ళు లేవగలగాలి… వాళ్ళ శక్తి తోనే లేవగలగాలి. అలాంటి మూడో రకం గురువు రామకృష్ణులకు తోడుగా వుండేవారు.

ఆమె రామకృష్ణుల సహధర్మచారిణి శారదామాత. రామకృష్ణులే వారిని జగన్మాతగా ఆరాధించారు.

చరకుడు {చరక సంహిత}

భారతీయ ఆయుర్వేదానికి గుండెకాయ చరకుడు

చరకుడు {చరక సంహిత}

ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివాడు. భారతీయ ఆయుర్వేదానికి అనితరసాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు క్రీ.పూ.3 వ శతాబ్దానికి చెందినవారు. మన పురాణాలలో “చరకులు” అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడినది. చరకుడు తన శిష్యవైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేవాడని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలలో చరకుని గురించి ఒక ఆశక్తిదాయకమైన కథ ఉంది. క్షీరసాగర మధనంలో పుట్టిన ధన్వంతరి మొదటగా ఆయుర్వేద విజ్ఞానాన్ని సర్పరాజైఅ ఆదిశేషుడిని ఉపదేశించాడు. ఒకసారి ఆయన భూలోకానికి వచ్చి తీవ్రమైన ఒకానొక వ్యాధికి గురియ్యాదు. కదలడానికి కూడా కష్టమైపోయింది. ఈ విచిత్ర పరిస్థితిలో తన వ్యాధిని పోగొట్టుకోనుoదుకు ముని కుమారునిగా జన్మించిన ఆదిశేషునే చరకునిగా చెబుతారు. “చర” అంటే భూమి మీద ధరించేవి అని అర్థం.

చరకుడు తన శిష్యులతో సంచరిస్తూ, అంటే పల్లెపల్లె తిరుగుతూ సంపన్నులకు, అతి సామాన్యులకు సమ ప్రాధాన్యం యిస్తూ వైద్య సహాయం అందించాడు. చరకుని వల్ల ఆయుర్వేదం భారతదేశంలో బహుళ వ్యాప్తి పొందింది. ఆయుర్వేద వైద్యం భారత దేశం లోని గ్రామ గ్రామాన విస్తరించి, ప్రతి ఊళ్ళోను ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేలా చేయడంలో చరకుడు – ఆయన శిష్యులు అవిరళ కృషి చేశారని చరిత్ర సాక్ష్యాలు నిరూపిస్తున్నాయి.

చరక సంహిత
*********
చరకుడు గొప్ప ఆయుర్వేద శిఖామణి. సుశ్రుతుడి లాగానే చరకుడు కూడా “చరక సంహిత” అనే గొప్ప ఆయుర్వేద సమగ్ర విజ్ఞాన గ్రంథం రచించాడు.
“చరక సంహిత” క్రీ.శ.3-2 శాతాబ్దాల మధ్య కాలంలో రచించినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఈ చరక సంహిత “అష్టాంగ స్థానములు” గా రచించబడినది. దీనిలో మొత్తం 120 అధ్యాయాలున్నాయి.
సూత్రస్థానం : 30 అధ్యాయములు
నిదానస్థానం : 8 అధ్యాయములు
విమానస్థానం : 8 అధ్యాయములు
శరీరస్థానం : 8 అధ్యాయములు
ఇంద్రియస్థానం : 12 అధ్యాయములు
చికిత్సస్థానం : 30 అధ్యాయములు
కల్పస్థానం : 12 అధ్యాయములు
సిద్ధిస్థానం : 12 అధ్యాయములు

చరకుని ఆయుర్వేద పరిజ్ఞానం మహోత్కృష్టమైనది. చరక సంహిత వెలువడిన కొన్ని శాతాబ్దాల తరువాత కూడా అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు చరక సంహితను మళ్ళీ మళ్ళీ తిరిగి రచించి ఎన్నో వ్యాఖ్యానాలు రాశాడు. వాళ్ళలో కాశ్మీకరుడు, ధృవబాల మొదలైన వాళ్ళు ముఖ్యులు. “చరకసంహిత” క్రీ.శ.987 లో అరబ్, పర్షియన్ భాషల్లోకి అనువదింపబడినది.

దీనిలో చికిత్స స్థానంలో 17 అధ్యాయాలు, కల్పస్థానం, సిద్ధిస్థానాలు పూర్తిగా క్రీ.శ. వ శతాబ్దానికి చెందిన ధృవబాల అనే ఆయుర్వేద శాస్త్రవేత్త రచించి కలిపినట్లుగా చరిత్రకారుల అభిప్రాయం.

శరీరానికి కలిగే వ్యాధులు ముఖ్యంగా వాత,పిత్త,శ్లేష్మ దోషాల వల్లే కలుగుతాయని సిద్ధాంతీకరించాడు చరకుడు. ఆయుర్వేద వైద్యుల చిట్టాలో ముఖ్య ఔషధాలలో ఒకటైన ఉసిరి కాయ, తానికాయ, కరక్కాయ లతో తయారైన త్రిఫల చూర్ణం చరకుడు ప్రసాదించినదే! అలాగే వ్యాధికి జరిపే చికిత్స కంటే ముందు వ్యాధి కారణాలను కనుగొనడం ముఖ్యమని ప్రతిపాదించాడు చరకుడు. క్యాన్సర్ కణాలకు, పక్షవాతం , మూర్చ , కుష్టువ్యాధి, చూపు మందగించటం లేదా పూర్తిగా పోవడం వంటి వ్యాధులకు అతి సులభమైన నివారణోపాయాలను చరకుడు తన చరక సంహితలో పొందుపరిచాడు.

మనిషి రోగాన్ని తగ్గించే శక్తి పాదరసానికి ఉందని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎన్నో మొండి రోగాలకు పాదరసాన్ని పుటం పెట్టి చరకుడు వైద్య ప్రయోగం చేసి రోగం నయం చేసిన తీరు పెద్ద పెద్ద వైద్య ప్రముఖుల్ని సైతం విస్మయానికి గురి చెసింది. మానసిక, శారీరక, ఆరోగ్యాలు రెండూ సరిగా ఉండటమే నిజమైన సంపూర్ణ ఆరోగ్యస్థితి అని ఆయుర్వేద వైద్య శాస్త్రం ఎన్నడో పేర్కొంది. భౌతిక పదార్థాలైన వృక్ష,జంతు, ఖనిజ,రసాయన సంబంధమైన ఔషధాలు శారీరక రుగ్మతల్ని తగ్గిస్తే కొన్ని రకాలైన మంత్రోచ్ఛాటన ఒక క్రమ పద్ధతిలో చేయటం వల్ల మానసిక రుగ్మతలు ఉపశమిస్తాయని చరకుడు ప్రతిపాదించాదు. ఇప్పుడు ఆధునిక వైద్యులు చేస్తున్న “ఆల్టాసోనిక్” వైద్య చికిత్సా విధానానికి చరుని సిద్ధాంతమే ప్రేరన.

మనిషి ఎప్పుడూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, శారీరక మానసిక దృడత్వాన్ని కలిగి ఉండాలని, మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యాన్నిస్తాయని, ఆహార విహారాదుల విషయంలో పరిశుభ్రత విధిగా పాటించినప్పుడే శారీరక ఆరోగ్యం స్థిరంగా ఉంటుందని సిద్ధాంతీకరించాడు. కేవలం శరీరం ఆరోగ్యంగా ఉండటం సాధ్యం కాదని, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ బాగున్నప్పుడే మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చరకుడు స్పష్టం చేశాడు.

ఆధునిక వైద్యులు నేటికీ చరక సంహిత లోని వైద్య సూత్రాలను, సూక్ష్మాలను గ్రహించి వైద్యసేవలు అందించటం విశేషం. చరకుని వైద్యగ్రంథం “చరకసంహిత” మీద మరిన్ని ఎక్కువ పరిశోధనలు విస్తృతంగా జరగవలసి ఉంది. అప్పుడే సర్వమానవాళికీ ఆయుర్వేదం ఆరోగ్యప్రదాయనిగా పరిఢవిల్లుతోంది.

భరత మాత ముద్దు బిడ్డ చంద్రశేఖర్ ఆజాద్ !!

భరత మాత ముద్దు బిడ్డ చంద్రశేఖర్ ఆజాద్ !!

భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడిగా బ్రిటీషువారి గుండెల్లో రైల్లు పరిగెత్తించిన ఈయన మనదేశం గర్వించదగ్గ అసమాన వీరుడు.

భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తిపేరు చంద్రశేఖర సీతారామ్ తివారి. ఈయన పండిత్‌జీగా కూడా పిలువబడ్డారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లా, బావ్రా (భాబ్ గా) గ్రామంలో పండిట్ సీతారామ్ తివారి, జగరానీ దేవీలకు 1906 జూలై 23వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసిన ఈయన వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు.

1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలతచెందిన ఆజాద్.. ఆ తరువాత 1921లో మహాత్మాగాంధీ నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నేరానికిగానూ ఈయన తన పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్టయ్యారు.

విచారణ సందర్భంగా కోర్టులో “నీ పేరేంటి?” అని మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు ఆయన పెద్ద శబ్దంతో “ఆజాద్” అని అరచి చెప్పారు. దాంతో ఆయనకు మెజిస్ట్రేట్ 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. అయితే ప్రతి కొరడా దెబ్బకు ఆయన భారత్ మాతాకీ జై (వందేమాతరం) అంటూ గొంతెత్తి నినదించారు. ఇక అప్పటినుంచి చంద్రశేఖర్ ఆజాద్‌గా ఆయన పేరు స్థిరపడిపోయింది.

సహాయ నిరాకరణోద్యమం ఆజాద్‌లో దాగి ఉన్న విప్లవవాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని బ్రిటీష్‌వారి కబంధ హస్తాల నుంచి విడిపించాల్సిందేనని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను స్థాపించారు. భగత్ సింగ్, సుఖదేవ్, తదితరులకు మార్గనిర్దేశకుడిగా మారారు.

1928వ సంవత్సరంలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి కన్నుమూసిన ‘పంజాబ్ కేసరీ లాలాలజపతిరాయ్ మృతికి ప్రతికారంగా రాజ్ గురు, భగత్ సింగ్, బ్రిటీష్ పోలీస్ అధికారి సాండర్స్ ను కాల్చి చంపగా, సాండర్స్ వెంట వచ్చిన హెడ్ కానిస్టబులు రాండ్ ను అజాద్ కాల్చి చంపాడు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ప్రభుత్వాలు ఆజాద్ ను సజీవంగా పట్టుకునే ప్రయత్నం చేశాయి. అతనిని ప్రాణాలతో తీసుకువచ్చినా లేక చంపి తెచ్చినా 30 వేల రూపాయలు బహుమతిగా ప్రకటించారు. అ రోజు 1931, ఫిబ్రవరి 27, శుక్రవారం అలహాబాదులోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా, ఒక్కడే పోరాడుతూ ముగ్గురు పోలీసులను హతమార్చారు. అలసిపోయేదాకా పోరాడిన ఆయన చివరి క్షణంలో తన వద్ద మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్‌తో తనను తానే కాల్చుకుని అశువులు బాసారు.

Yaksha Prasanalu

72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మ)
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)
5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)
6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)
7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన)
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.)
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మౄత్యు భయమువలన)
12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
13. భూమికంటె భారమైనది ఏది? (జనని)
14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)
15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల
ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో
తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో
అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)
17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)
20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ణ్జం చేయుటవలన)
21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)
22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడం వలన)
24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)
26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి
బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి
అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)
28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)
29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)
30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)
31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)
32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)
33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)
34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)
35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)
36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)
39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)
40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)
41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి,
ఆకాశములందు)
43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)
44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)
45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు,
ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)
46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)
47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)
48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)
49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ
దు:ఖాలను సమంగా ఎంచువాడు)
50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)
51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)
56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)
57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)
58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)
59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)
60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)
61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)
62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)
64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు;
వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,
దానం చెయ్యనివాడు)
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)
67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)
68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)
72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై
అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)

భగవంతుడు ధరించిన మానవ అవతారము………..

భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము తెల్పుతున్నది. శ్రీ రామ నవమి పండుగను స్వామి జన్మదినంగాను, సీతా మాతతో కళ్యాణ మహోత్సవంగాను జరుపుకుంటారు. హిందూ మతానుయాయుల ఆరాధ్య దైవం ఆ శ్రీ రామ చంద్రుని జన్..భగవంతుడు తన భక్తుల కోర్కెలను తీర్చుటకును, దుష్టుల సంహరించుటకును, సజ్జనుల కష్టముల నుండి కడతేర్చుటకును ఆయా సందర్భాను సారముగ అవతారముల నెత్తును. భారత ఇతి హాసముల ద్వారా పురాణముల ద్వారా కావ్యముల ద్వారా మనకు భగవంతుని అవతారముల గురించి తెలియుచున్నది.

పూర్వము వాల్మీకి యను మహర్షి శ్రీ మద్రామాయణము అను మహా కావ్యము వ్రాసెను. భారతీయులకు వాల్మీకి మొదటి కావ్యరచయిత; శ్రీ మద్రామాయణమే మొదటి కావ్యము . ఈ కావ్యము నుండి భగవంతుని దశావతారములు లోని రామావతారము గురించి మనకు తెలియుచున్నది.
భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము తెల్పుతున్నది. శ్రీరామునిగా మానవావతారమెత్తిన భగవంతుడు మానవుడు ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏఏ ధర్మాలను పాటించాలి అనే విషయాలను తను ఆచరించి మానవులకు చూపి, ఆదర్శమూర్తి అయి, ఇప్పటికిని అనగా త్రేతాయుగములో అవతరించి, ద్వాపరము అయి కలియుగము నడుస్తున్న ఈ నాటికి కూడా దేవునిగా కొనియాడబడుతూ శ్రీ రామ నవమి అను పేరున నవరాత్రములు, కళ్యాణ మహోత్సవములు జరిపించుకొనుచున్నాడు.

జన్మ వృత్తాంతం

త్రేతా యుగమున రావణాసురుడు యను రాక్షసుడు భూలోకమున లంకాధీశుడై పరమశివుడు, బ్రహ్మలగురించి తపస్సు చేసి వారిచే అనుగ్రహింపబడిన వర గర్వితుడై ఎవ్వరిని లెక్క చేయక దేవతలను, ఋషులను, హరి (విష్టువు) భక్తులను వేధించుచుండెను. అప్పుడు వారందరు హరిని ప్రార్ధించి తమ కష్టములను మొర పెట్టుకొనగా, ఆ మహా విష్ణువు రామునిగా అవతరించి రావణుని కడతేర్చెద నని వారికి చెప్పి, వారిని శాంతపరచి పంపెను.

భూలోకమున అయోధ్యా నగర చక్రవర్తి దశరధుడు పుత్రుల కొరకై పుత్ర కామేష్టి యను యఙ్ఞమును చేయుచుండెను. ఆ యఙ్ఞమునకు సంతసించిన దేవతలు అగ్ని దేవుని ద్వారా దశరధునికి పాయసము ను పంపిరి. ఆ పాయసమును దశరధుడు తన మువ్వురు భార్యలకు అనగా కౌసల్య, సుమిత్ర,కైకేయి లకు పంచెను. కొన్నాళ్లకు యీ మువ్వురు భార్యలు గర్భవతులై నలుగురు మగబిడ్డలను ప్రసవించారు. ఆ మహా విష్ణువే తన ఆది శేషువు, శంఖ చక్రములు, గదలతో సహా యీ నలుగురు పుత్రులుగా అవతిరించెను. రావణ సంహారము కొరకు అవతరించిన ఆనలుగురు పుత్రులే శ్రీరామ చంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు మరియు శతృఘ్నుడు.

చైత్ర మాసమున, శుద్ధ నవమీ తిధినాడు, పునర్వసు నక్షత్రమున ఐదు గ్రహములు ఉచ్ఛంలో నుండగ కర్కాటక లగ్నమున గురుడు చంద్రునితో కలసి వుండగా, జగన్నాధుడు, సర్వలోకారాధ్యుడు , సర్వ లక్షణ సంయుతుడును అగు ఆ మహా విష్ణువు కౌసల్యాదేవి గర్భమున శ్రీరామ చంద్రమూర్తిగా జనియించెను. శ్రీరాముడు పూర్ణ మానవుడుగా జీవించెను.

రామ నవమి
శ్రీ రాముని జననమైన నవమి తిధి నాడే ఆయన వివాహము సీతా మహాదేవి తో అయినదట. అట్లే రాజ్య పట్టాభిషేకము కూడ నవమి నాడేనట. అందుకనే శ్రీరామ నవమి అని చైత్ర శుద్ధ నవమి నాడే మనము పండుగ జరుపుకుంటాము.

విద్ధి విద్ధానం

ఆ రోజు మానవులందరూ తల స్నానము చేసి శుభ్రమైన లేక క్రొత్త బట్టలను ధరించి సీతారాముల పూజించి, కళ్యాణ మహోత్సవను జరిపించి, వసంత ఋతువు – ఎండాకాలము అగుటవలన పానకము, వడపప్పు ఆరగింపు చేసి ప్రసాదము పంచుదురు. దశమి నాడు పట్టాభిషేక ఘట్టము జరుపుదురు. కొందరు చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు రామనవరాత్రోత్సవము జరుపుదురు. ఈ తొమ్మిది దినములందు రామాయణ పారాయణము, రాత్రులందు రామకధా కాలక్షేపము జరుపుదురు.

శ్రీ రామనవమి నుండి రామకోటి వ్రాయుట నారంభించి, మరుసటి శ్రీ రామనవమికి ఆ వ్రతము ముగించు ఆచారము కూడ కలదు. శ్రీ రామ నామము లక్ష, కోటి వ్రాసిన ఒక్కోక్క అక్షరమే మహా పాతకములను నశింపజేయునని శంకరుడు పార్వతికి చెప్పునట్లు భవిష్య ఉత్తర పురాణమున ఉమామహేశ్వర సంవాదమున వివరింపబడినది.

దేవుడైనను, మానవ రూపమున నున్న కారణమున ఆ శ్రీ సీతారాముడు, మానవుడు తన దుఃఖ ములలో , కష్ట నష్టములలో ఏ విధంగా స్పందించునో ఆ విధముగనే ప్రవర్తించి చూపుటయే గాకపితృవాక్య పరిపాలనము, సత్యసంధత, భ్రాతృప్రీతి, స్నేహ బంధము, ఏక పత్నీ వ్రతము, ఒకే మాట – ఒకే బాణము , మొదలగు కష్టతరమైన ధర్మాలను ఆచరించి చూపి తన శీల సంపదతో మానవ జాతికే కనువిప్పు కలిగించెను.

అందుకనే “శ్రీ సీతారాముల గుడి లేని గ్రామముండదు… శ్రీ రామ అని మొట్ట మొదట వ్రాయక, యే వ్రాతయూ వ్రాయబడదు” అను నానుడి వచ్చినది. ఆ విధంగా శ్రీ రామ నవమి మానవాళికి పర్వదినమైనది.