Some Details about peacock

భారతజాతీయపక్షి నెమలి .సృష్టి లోనే సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే.నెమలి అంత పవిత్ర మయినది కనుకే మన జాతీయపక్షిఐంది. శర్వాణీ తనయుడు శరవణుడు తన వాహనంగా నెమలిని ఎంచుకున్నాడు. నెమలిని మయూరం అంటాం .పక్షిజాతులన్నింటిలోకీ అందమైనదీ, నృత్యం చేసే మగపక్షి నెమలి ఒక్కటే అనవచ్చు.

మెరిసే నీలం రంగు ఛాతీతో అందమైన మెడతో కంటికి విందుచేసే కంచు- ఆకుపచ్చ రంగులో దాదాపు రెండువందల పొడవైన ఈకలుకలిగిన పింఛం తో మగజాతి నెమలి ఉండగా , ఆడ నెమలి గోధుమ రంగులో మగ నెమలి కంటే చిన్నగా తోక లేకుండా ఉంటుంది. మగ నెమలి సర్వాంగ సుందరమైన ప్రణయనృత్యంతో తన తోకను విసనకర్రలా విప్పి ఈకలను సవరించుకునే విధానం ఒక కమనీయమైన ,చూచి కనువిందు చేసుకోవలసిన దృశ్యం. పక్షిజాతిలో “యోగవిద్య “తెలిసిన పక్షులు ఐదు మాత్రమే ఉన్నాయి, అవి:- శుకము, హంస, గరుత్మంతుడు, నెమలి , పావురము. వీటికి షట్ చక్రాల కుండలినీ పరిజ్ఞానము ఉంటుంది. నెమలికి అందం దాని పింఛంమే,కానీ దానికి ప్రమాదమూ దాని అందం చాటున పొంచే ఉంటుంది .

క్రౌంచపక్షి దేవతా పక్షి ఐనందున ఎంత దాహమేసినా భూమిపైన లభ్యమయ్యే ఏ నీటినీ త్రాగదు.మేఘాలు వర్షించే సమయంలో పడే స్వఛ్ఛ మైన నీటిబిందువులు భూమిపై పడక ముందే నోరుతెరచి ఆనీటిని నాలుకపై పడేలా చూసుకుని ఎంతో చాకచక్యంతో తన దాహాన్ని తీర్చుకుంటుంది.

ఇక నెమలి పుట్టుక వృత్తాంతంగురించీ తెలుసుకుందాం :-

దేవతాపక్షులైన క్రౌంచపక్షులకు ఒకమారుశరీరమంతా గాయాలు కాగా శ్రావస్తి పట్టణ సామంతుడైన పంచవర్ణుడు అనే రాజు వాటి గాయాలు నయంచేసినందుకు కృతఙ్ఞతతో ” ఓరాజా ! నీవుమా గాయాలు నయంచేసి నందుకు ప్రతిగా నీవు వృధ్ధుడివైనావుగనుక నీకు ‘నవయవ్వనాన్ని’ ప్రసాదించ దలచాము, నీకు ఇష్టమే కదా!” అని అడిగాయి. దానికి ఆరాజు పంచవర్ణుడు” ఓ! దేవతావిహంగాల్లారా! నాకు మీరు యవ్వనాన్ని ప్రసాదించడం కంటే నామరో కోరిక తీర్చితే సంతోషిస్తాను ..” అనగా ఆక్రౌంచపక్షులు ” రాజా ! మాకు మహోపకారం చేసిన నీకు నీవు కోరిన కోర్కెతీర్చడంకంటే ఆనందకరమైన విషయం మరోటి ఉండదు.నీకోరికేంటో చెప్పు , తప్పకతీర్చుతాం ” అన్నాయి.
వృద్ధుడైన ఆ రాజు పంచవర్ణుడు ” నాకూ మీకు మల్లే విహంగంలా ఆకాశంలో విహరించాలనే బలమైన ఇఛ్ఛ ఉంది , అది అనుగ్రహించండి. ” అనికోరగా ఆపక్షులు, ” అలాగే నీ ఇఛ్ఛనెరవేర్చుతాము , మేము చెప్పబోయే’ దేవతా మంత్రం ‘ఆకాశంలో మబ్బులు క్రమ్మినపుడే నీకు పనిచేసి, నీకు చిత్రవిచిత్రమైన వర్ణనలు కలిగిన శరీరము,ఈకలు, పింఛము కలుగుతాయి.. అప్పుడు ఈ జగత్తులో నీకంటే అందమైన పక్షి మరొకటి ఉండబోదు,ఐతే దీనికో నియమముంది, ఎటువంటి పరిస్థితులలో ఈ మంత్రం నీ భార్యకు చెప్పకు, అలాచెప్పావంటే ప్రమాదం సంభవిస్తుంది సుమా!” అనిచెప్పి మంత్రంబోధిం చి వెళ్ళిపోయాయి.

ఒకనాడు ఆకాశం మేఘావృతమై యుండగా ఆ మంత్రప్రభావం చూద్దామని, మంత్రోఛ్ఛారణ చేయగా ఆ మంత్రప్రభావానికి పంచవర్ణ మహారాజు ఒక మనోహరమైన, అందమైన పక్షిగా మారిపోయి ఆనందంగా గెంతులు వేస్తూ ఎగురుతుండగా అతని భార్య చూసింది. ఆమెకూ తన భర్తలా అలాంటి అందమైన పక్షిలా మారి ఆకమ్మని వాతావరణంలో విహరించాలనే కోరికకలుగగా ,ఆనాటినుండి భర్తను ఎన్నోవిధాలుగా బ్రతిమాలుతూ, కోపిస్తూ, అలుగుతూ చివరకు వేధిస్తూ ,హింసిస్తూ,ఆ మంత్రాన్ని తనకు చెప్పమని పోరసాగింది. ఇక ఆ బాధలు పడలేక పంచవర్ణమహారాజు సరేననిఅమంత్రాన్ని చెప్పాడు. ఇది తెల్సుకున్న ఆ మంత్ర అధిష్టాన దేవత అతని భార్యకు బుద్ధిచెప్పాలనుకుంది. ఆ మంత్రదేవత కారుమేఘాలను సృష్టించి ,వాతావరణాన్ని ఆనందమయం చేసింది. ఆ సమయంలో ఆరాజు భార్య ఆ మం త్రాన్ని జపించి , తను అతిసుందరమైన విహంగంగా మారిపోతున్నాననే భావనలో “అతిసుందర:” అనబోయి “అసుందర:” అన్నది. వెంటనే ఆ పదజాలంతో ఆమె పింఛంలేని ఆడ నెమలిగా మారిపోయింది. తమకిచ్చిన వాగ్దానాన్ని తప్పినందుకు ఆ క్రౌంచపక్షులు కోపించి ఆ రాజుని శాశ్వతంగా మగనెమలిగా మారిపొమ్మనిశపించాయి.ఆవిధంగా మగనెమలి, ఆడనెమలి సృష్టిలో ఉత్పన్నమయ్యాయని ఒకకధనం ..

రేతస్సు అనగా వీర్యం దీనిలో అమోఘమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఇలాంటి శక్తిని అధోపతన క్రియ ద్వారా మానవులు సంతానాన్నిపొంది వీర్యహీనులు అంటే తేజమును,శక్తిని కోల్పోతుండగా , యోగులు యిదే వీర్యాన్ని ” ఊర్ధ్వపతన” క్రియ ద్వారా కపాల భాగానికి చేర్చి మోక్ష మార్గ గాములుగా అవుతున్నారు.ఇటువంటి యోగులందరిలోకి శ్రీకృష్ణభగవానులు పరమోత్తములైన పరమయోగి పుంగవులు.. పదహారువేల మంది గోపికలున్నా, అష్టభార్యా సహితుడైనా, భామాలోలుడన్న పేరున్నా ఆయన అసలుసిసలైన అస్కలిత బ్రహ్మచారి. నెమళ్ళు తమ వీర్యాన్ని ఊర్ధ్వముఖంగా నడిపించగలశక్తి గలవి. అయితే జ్ఞానంలో మనిషికన్నా ఒకస్థాయి తక్కువగా ఉండటంవలన ఈ రేతస్సు (వీర్యం)పల్చటి జిగురు రూపంలో కంటిలోని గ్రంధుల ద్వారా బయటకు శ్రవించబడి ఒక రకమైన మదపువాసనను చిమ్మి ఆడనెమలిని ఆకర్షిస్తుంది. ఈ మదజలం, ఈ పతనమైన వీర్యం ద్వారా ఆడ నెమలి గర్భం ధరిస్తుంది.ఇక్కడ నెమలి గర్భం ధరించడం మానసికమైనది, స్త్రీపురుష జననేంద్రియాల సంభోగ ప్రక్రియ ప్రసక్తే లేదు. అందుకని నెమళ్ళు అర్ధస్ఖలిత బ్రహ్మచారులు. ఎప్పుడైతే,ఎక్కడైతే స్ఖలనము లేదో దానికి, యోగ సమానమై ఆరాధ్యనీయత కలుగుతుంది., ఆవిధంగా నెమలి పూజనీయమూ గౌరవస్థానమూ ఆక్రమించింది. అందువల్లే శ్రీకృష్ణుడు తన శిరముపైన నెమలిపింఛానికి సముచిత,సమున్నత స్థానాన్ని అనుగ్రహించాడు.

నెమలి జాతి శాకాహారము మరియు మాంసాహారము రెండిటినీ ఆహారంగా స్వీకరిస్తుంది. పూవుల రెక్కలు, మొక్క భాగాలు, విత్తనం మొలకలు, కీటకాలు, అప్పుడప్పుడూ బల్లి వంటి సరీసృపాలను మరియూ కప్పలు వంటి ఉభయచరాలను ఆహారంగా భుజిస్తుంది.’పావో క్రిస్టేటస్ ‘అనేది మన భారత దేశనెమలి – ఈ నెమలి మనకు భారత ఉప ఖండంలో తరుచుగా కనిపిస్తుంది. ఈ జాతి నెమలినే భారత మరియు శ్రీలంక దేశాలు తమ జాతీయ పక్షిగా ఎన్నుకున్నాయి.

నెమళ్ళు ఎక్కువగా గడ్డిమైదానాలలో నివశిస్తుంటాయి.మగ నెమళ్ళకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పింఛం ఉంటుంది. మగ నెమలికి వెనుక భాగంలో తోకలాగా కనిపించేది పింఛం , దానికి పొడవాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తుంది. ఆడ నెమలికి ఆకుపచ్చ, గోధుమ మరియు బూడిద రంగులలో ఉండే పింఛం ఉంటుంది. మగ నెమళ్ళ వలె ఆడనెమలికి పొడవైన తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పు ఉంటుంది.

నెమలి పింఛాలలోని ఆ అద్భుత రంగులకు కారణం, వాటి ఈకలమీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్దాలే. ఈకలపై కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు మరియు నీలం రంగులు అవసరం – వీటిలో ఒక రంగు అమరిక వలన సృస్టింపబడగా, రెండవది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వల్ల నే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పింఛాలు మనకు వివిధ కోణాలలో వివిధ రంగులుగా కనిపిస్తాయి.

ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమళ్ళు మనకు లభ్యమయ్యాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి. దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి ఋషులు నివసించే మునివాటికల్లో మొదట నెమళ్ళు నివసిస్తూ క్రమేపీ మనుషుల పోషణలో నెమళ్ళు ఉన్నట్లు భావిస్తున్నారు. అయినా కూడా నెమలిలో పెంపుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా గమనించవచ్చు. కాకపోతే వీటి నుండీ ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.

సాధారణంగా నెమలి జగడాల మారి, ఇతర పశుపక్ష్యాదులతో అంతత్వరగా కలవదు. నెమలి మన జాతీయ పక్షి. మన సంస్కృతీ సంప్రదాయాలలో ఈ మనోహర పక్షి స్థానం అద్వితీయమైనది; అనుపమేయమైనది. పురాతన యుగాల నుంచి మనభారత ప్రజలు మయూరాన్ని పూజిస్తున్నారు.

నాలుగు దశాబ్దాల క్రితం ప్రభుత్వం తొలుత వన్య ప్రాణుల సంరక్షణా చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు నెమలి ఈకల వ్యాపారాన్ని అనుమతించారు. ఆ పక్షులు సహజంగా రాల్చిన ఈకలతోనే ఆ వ్యాపారం జరుగుతుందని విశ్వసించడమే అందుకు కారణం. అన్ని పక్షులు మాదిరిగానే నెమలి కూడా తన ఈకలను రాల్చుతుంది; అయితే, పక్షులన్నిటి వలే నెమలి సైతం కేవలం సంవత్సరంలో ఒక నెల మాత్రమే తన ఈకలను రాల్చుతుంది. ఆగస్ట్ -సెప్టెంబర్ మాసాలలో ఇది జరుగుతుంది. పగటిపూట నెమలి ఒంటరిగా ఉంటుంది. నెమలి నింగిలోకిఇతర పక్షుల వలె ఎగిరి వెళ్ళలేదు. నెమలి బృంద జీవి. ఒకే చెట్టు మీద నివశిస్తుంది. సదా ఒకే గూటిలో ఉంటుంది. మానవ ఆవాసాల పరిసర ప్రాంతాల్లో నెమళ్ళు విహరిస్తుంటాయి. కనుక అది అందుబాటులో ఉంటుంది.

ఒంటరి పక్షి కనుక తన ఈకలను ఏకాంత ప్రదేశాలలో రాల్చుతుంది. నెమలి ఈకలను విక్రయించే దుకాణాలు ఉన్న వారెవ్వరూ కేవలం నెమళ్ళు రాల్చివేసే ఒకే ఒక్క ఈక కోసం ఎవరినీ ఆ ప్రదేశాలను వెదకడానికి పంపించరు. నెమలి చాలా దూరం ఎగుర లేదుకనుక చాలా ఎత్తు ప్రాంతాలకు కూడా వెళ్ళలేదు, కనుక దానిని పట్టుకోవడం చాలా తేలిక. చెట్టుపై ఎప్పుడూ ఒకే కొమ్మ పై ఉంటుంది. కనుక మా వుసులువుగా పట్టుకోగల పక్షి నెమలి.

నెమలిని మాటు వేసి పట్టుకోవడం చాలా తేలిక. పట్టుకున్న నెమళ్ళను చంపివేసి, వాటి ఈకలను పెరికి గోతాలనిండా వేసి ట్రక్కుల్లో వ్యాపార కేంద్రాలకు పంపుతారు. నెమళ్ళు నీరు త్రాగటానికి సరస్సులు, చెరువులు వద్దకు వచ్చినప్పుడో లేదా అవి తమ గూళ్ళకు వెళుతున్నప్పుడో వాటిని జాగ్రత్తగా అనుసరించి వెళ్ళి ,దొంగ వేటగాళ్ళు వాటి కళ్ళు మిరిమిట్లు గొలిపేలా కాంతిని ప్రసరింపచేసి వల వేసి పట్టుకుంటారు. పట్టుకోవడం కష్టమైనపుడు వాటిని ఆహార పదార్థాల వైపు ఆకర్షించి , ఆ తరువాత ఆ పదార్థాలలో విషం కలిపి నెమళ్ళు అవితిని చనిపోతే వేటగాళ్ళు ఆతర్వాత వాటి ఈకలు పీకి తీసుకెళతారు.రాజస్థాన్, గుజరాత్‌లలో దుర్భిక్ష పరిస్థితుల మూలంగా నెమళ్ళు దాదాపుగా అంతరించిపోయాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో రోజూ వేలాది మయూరాలను వ్యాపారంకోసం మానవులు చంపేస్తున్నారు.

చంపి వేసిన నెమళ్ళ ఈకల గట్టి భాగం (కాడ) లోపల రక్తపుచారికలు ఉంటాయి. సహజంగా త్యజించిన ఈకల కాడలలో ఇటువంటి రక్తపు చారికలు ఉండవు. నెమలి ఈకల వ్యాపారంలో ఉన్నవారు నెమళ్ళను పట్టుకోగానే ఈకలను పెరికివేసి వాటి కాడలను నరికివేస్తారు. మార్కెట్‌లో లభ్యమయ్యే నెమలి ఈకలను నిశితంగా గమనిస్తే ప్రతిదాని కాడ నరికి వేయబడివుంటుంది. నెమలి ఈక లేదా పింఛం మానవులకు నిరుపయోగమైనది. తినడానికి గాని, ధరించడానికి గాని పనికిరాదు. కొనుక్కుని ఇంటి వద్ద లేదా దైవ మందిరంలో కలశంలో పెట్టుకొని చూసి ఆనందించడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. వ్యాపారస్తులు వాటితో పింఛంతో విసనకర్ర లు తయారుచేసి అమ్ముతారు. నెమలి ఈకల వ్యాపారం దాదాపు 90 శాతం విదేశీ పర్యాటకులతోనే జరుగుతుంది. స్టార్ హోటళ్ళలోని దుకాణాలు, పర్యాటకులను ఆకర్షించే క్యూరియో షాపుల్లో , నెమలి ఈకలను విక్రయిస్తుంటాయి. నెమలి ఇప్పుడు మనుగడ ముప్పులో ఉన్న పక్షి. మరి మన భారత జాతీయపక్షి ఒక విసనకర్రగా మారిపోవడాన్ని తక్లుచుకుంటే బాధగా అనిపిస్తుందికదూ.

వంద కన్నుల పింఛంతో మనోహరంగా నర్తనం చేసే నెమలి నక్షత్రాలు, సూర్యచంద్రులు, విశాల విశ్వానికీ ప్రతినిధి. కరుణ, సహానుభూతి, పరిశుద్ధాత్మకు సంకేతం. ఒక సూఫీ తాత్వికుని దృష్టిలో జీవాత్మ నెమలిరూపంలో సృష్టించబడిందిట!. అది తనను తాను దివ్య దర్పణంలో చూచుకున్నప్పుడు తన అందానికి తానే మురిసిపోతుంది. దాని శరీరం నుంచి జాలువారిన చెమట చుక్కలే ఇతర జీవులుగా పరిణమించాయని అంటాడు!.

గ్రీకు దేవత హెరా, రోమన్ దేవత జూనో, క్రిస్టియన్ సర్వశక్తిమంతుని చిహ్నం, చైనా సంస్కృతిలో వర్ష చిహ్నం, బౌద్ధ ధర్మపు జీవన చక్రం… ఇలా వివిధ మతాలు, సంస్కృతులలోని ఉత్కృష్ట భావనలకు ప్రతీక నెమలే. ఇక మన సంస్కృతిలో నెమలికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుమారస్వామి వాహనం నెమలి. నెమలి పింఛం ధరించిన శ్రీకృష్ణపరమాత్మ హిందువుల హృదయాల్లో నిలిచిఉంటాడు. అమరత్వానికి చిహ్నం నెమలే. అయినా జాతీయ పక్షిగా మనం గౌరవిస్తున్న నెమలి విసనకర్రగా పరిణమించేందుకు మనందర సహకరించి అంగీకరిస్తూనే ఉన్నాం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s