గంగానది మహిమ

గంగానది మహిమ

స్వర్గంలో “మందాకిని”గా, భూలోకంలో “గంగ” లేదా “అలకనంద”గా, పాతాళంలో “భోగవతి”గా మూడు లోకాల్లో ప్రహించినందున గంగను “త్రిపథగ” అంటారు. భారతదేశం ఆర్ధిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడివడి ఉన్నాయి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. “గంగమ్మ తల్లి” అనీ, “పావన గంగ” అనీ, “గంగా భవాని” అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. “నీరు” అన్న పదానికి సంస్కృతంలో “గంగ” అన్న పదాన్ని వాడుతారు. ఉత్తరాంచల్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీనదం(Glacier)లో భాగీరధి నది ఉద్భవిస్తున్నది. ప్రవాహ మార్గంలో దేవ ప్రయాగ వద్దఅలకనందనది దీనితో కలుస్తుంది. అక్కడినుండి దీనిని “గంగ” అంటారు. కొంత దూరం హిమాలయాలలో ప్రహించిన ఈ నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తున్నది.

గంగా నది మొత్తం పొడవు షుమారు 2,510 కి.మీ.(1,557 మైళ్ళు). గంగ, దాని ఉపనదియైన యమున కలిసి విశాలమైన మైదానప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. సారవంతమైన ఈ “గంగా-యమునా మైదానం” ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌లలో విస్తరించి ఉన్నది. మొత్తం ప్రపంచ జనాభాలో 8.5 % ప్రజలకు (ప్రతి 12 మందికీ ఒకరికి) ఈ మైదానం నివాసస్థానం. మైదానాలలో ప్రహించే మార్గంలో గంగానదితో కోసి, గోమతి, శోణ వంటి ఉప నదులు కలుస్తాయి. అన్నింటికంటే పెద్దదైన యమునానది అలహాబాదు, (ప్రయాగ) వద్ద గంగానదితో కలుస్తుంది. యమున సాంకేతికంగా గంగకు ఉపనదియైనా గాని, యమున చాలా పెద్ద నది గనుక వేరే నదిగా అన్నివిధాల పరిగణింప వచ్చును. గంగతో పాటు యమునకు కూడా హిందూమతంలో పవిత్ర స్థానం ఉన్నది. ఈ రెండు నదుల ఒడ్డున ఉత్తరభారతదేశంలో పెద్దవైన నగరాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఢిల్లీ, కాన్పూరు, అలహాబాదు, వారాణసి, పాట్నా, కొలకత్తా వంటివి అలాంటి నగరాలలో కొన్ని.

అలహాబాదు తరువాత మరెన్నో నదులతో కలిసి గంగానది మహా ప్రవాహంగా మారుతుంది.పశ్చిమ బెంగాల్‌లో మాల్దా వద్ద మొదటిసారి చీలుతుంది. అక్కడినుండి హూగ్లీ నది (గంగానది చీలిక) ప్రారంభమౌతుంది. విశాలమైన గంగా-హూగ్లీ డెల్టా ఇక్కడితో మొదలౌతుంది. కొలకత్తా నగరం హూగ్లీ వడ్డున ఉంది. ప్రధానమైన గంగానదిని మాల్దా తరువాత “పద్మ” నది అంటారు. పద్మ నది బంగ్లాదేశ్‌లో ప్రవేశించిన తరువాత బ్రహ్మపుత్రా నది చీలిక అయిన జమునా నది పద్మతో కలుస్తుంది. ఆ తరువాత మేఘనా నది కూడా దీనితో కలుస్తుంది. బంగ్లాదేశ్ మైదానాలలో ఈ మహాప్రవాహం అనేకానేకంగా చీలి అక్కడి సుందర వనాలు డెల్టా గుండా ప్రవహించి, తరువాత బంగాళాఖాతం సముద్రంలో కలుస్తాయి.

పావన గంగ

హిందూ మతం ఆచారాల ప్రకారం గంగానది పవిత్రమైనది. పావనం చేసేది. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలనుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమనీ నమ్మకం. చనిపోయిన తమ కుటుంబీకుల అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరదూరాలనుండి వారాణాసికి, గయకు, ప్రయాగకు, ఇతర గంగానదీ తీర్ధాలకు వస్తారు. గంగా నది జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రథమని భావిస్తారు.గంగా నది తీరాన కుంభ మేళ, ఛత్‌పూజ వంటి ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహం కూడుకొనే ఉత్సవం.వారాణాసి హిందువులకు పరమ పవిత్ర స్థానం.

గంగావతరణ గాధ

గంగ గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాధలు ఉన్నాయి. భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగను గూర్చి పెక్కు గాధలున్నాయి.

జగజ్జనని (అంతర్ధానాంశయై) నిరాకారయైన గంగ బ్రహ్మదేవుని కమండలువునందుండెను. ఒకమారు శంకరుడు రాగము లాలాపించినపుడు నారాయణుడు ద్రవీభవించెను. ఆ పరబ్రహ్మ ద్రవమునకు బ్రహ్మదేవుడు తన కమండలువును తాకించగా నిరాకార గంగ జలమయమయ్యెను. శ్రీ మహావిష్ణువు వామనావతారమున త్రివిక్రముడై ఎల్లలోకములను కొలిచినపుడు బ్రహ్మ తన కమండలములోని ఆ నీటితోనే విష్ణుపాదమును కడిగెను. (బ్రహ్మ కడిగిన పాదము – అన్నమయ్య కీర్తన). ఆ పాదమునుండి ప్రవహించునదే దివ్యగంగ.

సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజసుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగధేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు. వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.

భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై “నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?” అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్ధనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, “జాహ్నవి” అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.

పురాణము ప్రకారము

ఒకానొక నది. హిమవంతమునందు పుట్టినందున దీనిని హిమవంతుని కూఁతురు అందురు. ఇది దేవలోకమునందుండి భగీరథుని ప్రయత్నమున భూలోకమునకు వచ్చెను. భగీరథుఁడు, తన ముత్తాతలు అగు సగరపుత్రులు కపిల మహామునియొక్క కోపాగ్నిచేత నీఱుకాఁగా, వారికి సద్గతి కలిగింప తలఁచి గంగను కూర్చి తపస్సు చేసి భూలోకమునకు దిగివచ్చునట్లు ప్రార్థించెను. అప్పుడు ఆమహానది తాను భూలోకమునకు వచ్చునెడ తన ప్రవాహవేగమును ధరింపఁగలవారిని ఒకరిని ఏర్పఱచుకొనిన పక్షమున, తాను వచ్చునట్లు ఒప్పుకొనెను. అంతట భగీరథుఁడు రుద్రునిఁగూర్చి తపము ఆచరించి అతని అనుగ్రహము పడసి, గంగాప్రవాహమును వహింప ప్రార్థించెను. అపుడు గంగ మిక్కిలి అట్టహాసముతో భూమికి దిగి రాసాగెను. అది రుద్రుఁడు చూచి గంగను తన ప్రక్కకు ఆకర్షించి జటాజూటమునందు నిలిపి పిదప కొంతకాలమునకు భగీరథుని ప్రార్థనచే తన శిరస్సునుండి ఏడుబిందువులను భూమిమీఁద వదలెను. అది కారణముగ రుద్రుఁడు మందాకినీమౌళి అనఁబడును. ఆ బిందువులు పడిన చోటు బిందుసరస్సు అనియు ఆబిందుసరస్సునుండి వెడలి గంగ ప్రవహించును అనియు చెప్పుదురు. అట్లు వెడలి ఆగంగ జహ్నుమహాముని యజ్ఞశాలయందు ప్రవేశింపఁగా అతఁడు కోపించి దానిని పానముచేసి, పిమ్మట భగీరథుఁడు ప్రార్థింపఁగా ప్రసన్నుఁడై తన చెవినుండి వెడల విడిచెను. ఇందువలన గంగకు జాహ్నవి అను పేరు కలిగెను. మఱియు ఈనది భగీరథుని వెంట పాతాళమునకు పోయెను కనుక దీనిని త్రిజగత్కల్యాణి, త్రిపథగ అని అందురు.

త్రివిక్రమావతారమున విష్ణువు భూమియందు ఒక పాదము ఉంచి రెండవపాదముచే మీఁది లోకమును కప్పునప్పుడు బ్రహ్మాండము పగిలి ఆకాశగంగ ఆయన పాదముగుండ క్రిందికి ప్రవహించినందున దీనికి విష్ణుపది అను పేరు కలిగెను. ఊర్ధ్వలోకములయందు వ్యాపింప చేసిన త్రివిక్రమదేవుని పాదమును బ్రహ్మ తన కమండల జలముచే కడుగఁగా ఆజలముప్రవహించి ఈనది ఏర్పడెను అనియు అది కారణముగ దీనికి విష్ణుపది అను పేరు కలిగెను అనియు కొందఱు చెప్పుదురు.

గంగా స్నానం మరియు గంగా మహిమలు

భారతంలో బీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు కోరికపై బీష్ముడు గంగానది మహిమలు వర్ణించాడు.అవి ఈ క్రింద వివరించబడినాయి.

గంగా, యమున ,సరస్వతులు కలసిన సంగమంలో స్నానం చేసినందువలన కలుగు పుణ్యం యజ్ఞ యాగాది దానాదులు చేసినదానికంటే అధికం.గంగాజలం కొంచమైననూ దేహమునకు సోకిన సకల పాపములు నశించును.స్వరం లభించును.నరుని ఎముక గంగానదియందు ఎన్ని సంవత్సరములు ఉండునో అతడు అన్ని సంవత్సరములు స్వర్గమున నివసించును.గంగాస్నానమాచరించిన వారు పరిశుద్ధులగుటయేకాక ఏడు తరముల వారు పరిశుద్ధులగుదురు.గంగా జలం త్రాగిన కలుగు ఫలితం నూరు చంద్రాయణం చేసినదానికంటే అధికం.శిరస్సు, దేహంలందు గంగా మృత్తిక(మట్టి)ను రాసుకుని స్నానమాచరించిన గరుత్మంతుని చూచి పాములు పారిపోయినట్లు పాపములు దూరమగును.ఆధారం లేని జనులకు గంగ ఆధారమగును. దేవతలకు అమృతము వలె మునులకు గంగ ప్రియమైనది. గంగానది తరంగముల నుండి వచ్చిన గాలి దేహమునకు సోకిన పరమానంము కలిగించుచూ పాపములను దూరం చేయును.మరణకాలమందు గంగను తలచినవారికి మోక్షం లభించును.గంగా నది మహిమలు చెప్పుకొను వారికి పాప భయం,రాజ భయం,చోర భయం,భూత భయం మొదలైన భయములు నశించును.గంగ ఎంతయో పుణ్యరాశి అయినందున ఆకాశము నుండి దిగి వచ్చినప్పుడు ఈశ్వరుడు తలమీద ధరించాడు. గంగ మూడు లోకములందు ప్రవహించి లోకాలను పునీతం చేస్తుంది.భగీరధుడు కపిల ముని శాపం వలన భస్మమైన తన పితరులకు మోక్షప్రాప్తి కలిగించడానికి తపమాచరించి బ్రహ్మలోకం నుండి భూలోకానికి తీసుకు వచ్చాడు.గంగా నది బ్రహ్మలోకం నుండి మేరురూపుడైన విష్ణువు నుండి సూర్యుని నుండి చంద్రుని నుండి శివుని జటాజూటం నుండి హిమవంతం నుండి భూమి మీదకు ప్రవహిస్తుంది.గంగ తొలుత విష్ణు పాదం నుండి ఉద్భవించింది కనుక గంగను భక్తితో శరణుజొచ్చిన మోక్షం నిశ్చయం.గంగ మహిమను బ్రహ్మాది దేవతలు స్తుతి చేస్తుంటారు.నరులకు గంగానది మహిమ వర్ణించుట సాధ్యము కాదు.తన వర్ణాశ్రమ ధర్మములు నిర్వహించుతూ గంగనది మహిమలను మనోవాక్కాయకర్మల స్మరించు వారికి సకల సౌఖ్యములు కలుగును.

గంగానదిలో భక్తితో స్నానం చేసి పూజిస్తే వారికి యజ్ఞములు, బ్రహ్మచర్యము, తపస్సు, దానములు చేసిన ఫలము చేకూరుతుంది. గంగానది లేని దేశము, సోమము లేని యజ్ఞము, చంద్రుడు లేని రాత్రి, సూర్యుడు లేని పగలు, ఆత్మధర్మము లేని ఆశ్రమము, పూలు లేని చెట్లు మాదిరి శోభించ లేదు. చాంద్రాయణవ్రతములు నూరు చేసినా గంగాజల పానము చేసిన దానితో సమానము కాదు. అగ్నిలో పడిన దూది దగ్ధము అయినట్లు గంగానిదిలో స్నానము చేసిన మానవుడికి పాపములు దగ్ధము అవుతాయి. గంగానది ఇసుక తలమీద పెట్టుకుని గంగానది మట్టి నుదుటిన ధరించిన వారి పాపములు నశిస్తాయి. గంగాస్నానము చేసిన అటు ఏడుతరాలు, ఇటు ఏడుతరాలు పితృదేవతలు తరిస్తారు. అంతెందుకు ఎక్కడ స్నానము చేస్తున్నా గంగలో మునుగుతున్నట్లు భావన చేసినా గంగాస్నాన ఫలము దక్కుతుంది. గంగను చూసిన వాడు మానవుడు గంగను చూడని వాడు పశువుతో సమానము, గుడ్డివాడితో సమానము. దేవతలు, ఇంద్రుడు కూడా సదా గంగను స్మరిస్తారు ఇక మానవుల సంగతి చెప్పనలవి కాదు. మరణసమయంలో గంగను స్మరించిన వాడికి ముక్తి తధ్యము. గంగాస్నానను చేసిన వాడికి రాజభయము, చోరభయము, పాపభయము, భూతభయము కలుగవు. అచంచలమైన భక్తితో ఎవరు గంగను పూజించి, ఆశ్రయిస్తారో వారికి గంగ సకల సంపదలను ప్రసాదిస్తుంది ” అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s