ఎల్ నినో, లా నినా అంటే?

ఇవి రెండూ ప్రపంచ వాతావరణ పరిస్ధితులకు సంబంధించినవన్న సంగతి చాలా మందికి తెలుసు గానీ అవి నిర్దిష్టంగా ఎందుకు ఏర్పడుతాయో తెలియదు. నిజానికి శాస్త్రవేత్తలకు కూడా పూర్తిగా వీటి గురించి తెలియదు. 17వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ అమెరికా ఖండం పశ్చిమ తీరంలోని మత్స్యకారులు ఈ వాతావరణ పరిస్ధితిని మొదటిసారి కనుగొన్నారని రికార్డులు చెబుతున్నాయి. అప్పటి నుండీ శాస్త్రవేత్తలు వీటిపై అధ్యయనం చేస్తున్నారు. ఆ అధ్యయనం ఇంకా పరిణామ దశలోనే ఉంది.

సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఎల్ నినో, వర్షాభావ పరిస్ధితిని వివరిస్తుంది. లా నినా విపరీతంగా వర్షాలు కురిసే పరిస్ధితిని వివరిస్తుంది. స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే క్రైస్తవ బాలుడు (బాల యేసు) అని అర్ధం. లేదా బాలుడు (ద బాయ్) అని కూడా పిలుస్తారు. డిసెంబర్ నెలలో ఎల్ నినో వాతావరణ పరిస్ధితి ఉచ్ఛ దశకు చేరుతుంది. క్రీస్తు పుట్టిన రోజు డిసెంబర్ లో వస్తుంది గనుక క్రిస్టమస్ పండుగను సూచిస్తూ ఎల్ నినో అని నామకరణం చేశారు.

లా నినో కూడా స్పానిష్ పదమే. ఆంగ్లంలో దీని అర్ధం ‘ద గర్ల్’ అని. ఎల్ నినో కు సరిగ్గా విరుద్ధంగా ఉంటుంది గనుక ‘ద బాయ్’ విరుద్ధ పదం అయిన ‘ద గర్ల్’ గా దానిని పిలుస్తున్నారు. ‘ఎల్ నినో’ లాగా, ‘లా నినా’ మరో బాలికా దేవతా స్త్రీని సూచించదు.

ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలు మరియు ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య విస్తరించే ఉండే పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు ఎల్ నినో – లా నినా లకు కారణం అవుతాయి. ఈ రెండింటినీ కలిపి ‘ఎల్ నినో సదరన్ ఆసిలేషన్’ (ENSO) వలయాలు అంటారు. సముద్రము, దానిపైన ఆవరించి ఉండే వాతావరణాల ఉష్ణోగ్రతలు తీవ్ర స్ధాయిలో ఒడిదుడుకులకు లోనవడం వల్ల ఇవి ఏర్పడతాయి. ENSO యొక్క ఉష్ణ దశను ఎల్ నినో అనీ చలి దశను లా నినా అనీ పిలవచ్చు.

సాధారణంగా పసిఫిక్ మహా సముద్రంలో వాణిజ్య పవనాలు ఉపరితల సముద్ర నీటిని తూర్పు నుండి పశ్చిమానికి కొనిపోతాయి. అనగా మధ్య అమెరికా పశ్చిమ తీరం, దక్షిణ అమెరికా ఖండం యొక్క ఉత్తర భాగంలోని పశ్చిమ తీరాల నుండి ఉపరితల సముద్ర నీరు ఆసియా, ఆస్ట్రేలియా తీరాలకు కొనిపోతాయి. ఆస్ట్రేలియా దక్షిణ, ఈశాన్య తీరాలు, చైనా, ఆస్ట్రేలియాల మధ్య ఉన్న వివిధ ద్వీప దేశాలు వీటి మార్గాలో ఉంటాయి. ఈ వాణిజ్య పవనాలు సుదీర్ఘ దూరాలు సూర్యుడి కింద ప్రయాణించడం వలన పశ్చిమ దిశకు వెళ్ళేకొద్దీ వేడెక్కుతాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ.

ఎల్ నినో ఏర్పడినప్పుడు దీనికి విరుద్ధ పరిస్ధితులు ఏర్పడతాయి. పెరూ, ఈక్వడార్ దేశాల తీరం నుండి పశ్చిమం వైపుగా ఉన్న సముద్ర ఉపరితలం సాధారణ స్ధితి కంటే వేడెక్కుతుంది. ఫలితంగా పసిఫిక్ సముద్రంలో భూమధ్య రేఖకు సమీపంగా తూర్పు నుండి పశ్చిమానికి ప్రయాణించే వాణిజ్య పవనాలు బలహీనపడతాయి. దానితో పశ్చిమ పసిఫిక్ సముద్ర ఉపరితల జలాలు తూర్పుకు ప్రయాణిస్తాయి. దీనివల్ల అమెరికా ఖండాలలోనూ భారత ఉపఖండం లోనూ, ఈశాన్య యూరప్ లోని కొన్ని ప్రాంతాలలోనూ తీవ్ర వర్షాభావ పరిస్ధితులు ఏర్పడతాయి.

ఎల్ నినో వల్ల సముద్ర జలాల ఉష్ణోగ్రత సగటున 0.5 డిగ్రీల సెంటీ గ్రేడు పెరుగుతుంది. ఈ పెరుగుదల ఒక్కోసారి, అరుదుగానే అయినా, 2 నుండి 6 డిగ్రీల వరకూ కూడా ఉండవచ్చు. ఎల్ నినో సంభవానికి ఒక క్రమ పద్ధతి అనేది ఏమీ లేదు. 2 నుండి 7 సంవత్సరాల వ్యవధిలో ఇది ఏర్పడవచ్చు. సగటు వ్యవధి 5 సం.లు అని ఒక అంచనా. ఎల్ నినో వ్యవధి 7 నుండి 9 నెలల వరకూ ఉంటుంది.

వికీ పీడియా ప్రకారం ఎల్ నినో సంభవించింది అనడానికి ఈ కింది పరిణామాలు సూచికలు.

1. హిందూ మహా సముద్రం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా లపైనా ఉపరితల ఒత్తిడి పెరుగుతుంది.

2. తహితితో సహా మధ్య-తూర్పు పసిఫిక్ సముద్రం పైన ఉపరితల గాలి ఒత్తిడి పడిపోతుంది.

3. దక్షిణ పసిఫిక్ లోని వాణిజ్య పవనాలు బలహీనపడతాయి. లేదా తూర్పుకు ప్రయాణిస్తాయి.

4. పెరు దేశంపై గాలి వేడెక్కి వాతావరణం పైకి ప్రయాణిస్తుంది. అక్కడ చల్లబడి ఉత్తర పెరు ఎడారిలో వర్షాలు కురుస్తాయి.

5. సముద్ర ఉష్ణ జలాలు పశ్చిమ పసిఫిక్, హిందూ మహా సముద్రాల నుండి తూర్పు పసిఫిక్ కు విస్తరిస్తాయి. అవి తమతో పాటు వర్షాన్ని కూడా తీసుకెళ్తాయి. ఫలితంగా పశ్చిమ పసిఫిక్ తీరం, హిందూ మహా సముద్రం (ఇండియా) లలో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు ఏర్పడడమే గాక సాధారణంగా వర్షం పెద్దగా కురవని పొడి ప్రాంతాలయిన తూర్పు ఫాసిఫిక్ తీరంలో వర్షం భాగా కురుస్తుంది. అమెరికా వరకు చూస్తే పశ్చిమ తీర ప్రాంతం ఎండిపోయి తూర్పు గల్ఫ్ తీర ప్రాంతంలో వర్షాలు దండిగా కురుస్తాయి.

ఎల్-నినో ప్రభావం ఇండియాపైన ఉంటుంది. కానీ స్ధిరంగా ఉండదు. ఈ సంవత్సరం ఎల్ నినో ఏర్పడే అవకాశం 60 శాతం ఉన్నదని భారత వాతావరణ విభాగం రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఎల్ నినో సంభవించినప్పుడల్లా ఇండియాలో వర్షాభావం ఏర్పడుతుందన్న నియమం లేదు. కొన్నిసార్లు తీవ్ర ప్రభావం చూపగా మరికొన్నిసార్లు పెద్దగా ప్రభావం చూపలేదు. 1997-98లో తీవ్ర స్ధాయి ఎల్ నినో సంభవించింది. కానీ ఇండియాపై ప్రభావం చూపలేదు. 2002లో ఒక మాదిరి ఎల్ నినో ఏర్పడగా ఇండియాలో తీవ్ర కరువు పరిస్ధితి ఏర్పడింది. మొత్తం మీద చూస్తే గత శతాబ్ద కాలంలో ఎల్ నినో వల్ల ఇండియాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయింది. సగం కంటే ఎక్కువసార్లు దుర్భిక్ష పరిస్ధితులు ఏర్పడ్డాయి. అనగా ఎల్ నినో ప్రభావం భారత వ్యవసాయరంగాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.

లా నినా వాతావరణం సాధారణంగా ఎల్ నినో అనంతరం ఏర్పడతాయి. కానీ ఎల్ నినో అనంతరం ఖచ్చితంగా లా నినా ఏర్పడుతుందని గ్యారంటీ లేదు. తూర్పు పసిఫిక్ మహా సముద్రంలో భూ మధ్య రేఖ ప్రాంతం వెంబడి ఉష్ణోగ్రతలు సాధారణ స్ధాయి కంటే పడిపోయినప్పుడు లా నినా ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత తగ్గుదల 3 నుండి 5 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చు. లా నినా ప్రభావాలు ఎల్ నినో ప్రభావాలకు సరిగ్గా విరుద్ధంగా ఉంటాయి. ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తాయి. ముఖ్యంగా చిలీ, పెరు, న్యూ జీలాండ్, ఆస్ట్రేలియా తీరాల్లో కుంభ వృష్టి పడుతుంది. లా నినా వల్ల పశ్చిమ ‘దక్షిణ అమెరికా’ లో కరువు ఏర్పడితే ఉత్తర ‘దక్షిణ అమెరికా’లో వర్షాలు బాగా కురుస్తాయి.

ఇండియాలో ఎల్ నినో వల్ల, 2009లో జరిగినట్లుగా, నైరుతీ ఋతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. లా నినా వల్ల భారత నైరుతీ ఋతుపవనాలు లాభపడతాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఇవ్వడానికి దోహదం చేస్తుంది. ఉదాహరణకి 2010లో పసిఫిక్ లో ఏర్పడిన లా నినా వల్ల ఇండియాలో నైరుతీ ఋతుపవనాలు దండిగా వర్షాలు ఇచ్చాయి. ఆస్ట్రేలియాలో అయితే ఆకాశం విరిగి నేలమీద పడినట్లుగా వర్షాలు కురిసి తీవ్రమైన ఉత్పాతాలకు దారితీసింది.

ఎల్ నినో ఏర్పడేందుకు గ్లోబల్ వార్మింగ్ కారణమా? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం శాస్త్రవేత్తలకే ఇంకా తెలియదు. రెండింటికి సంబంధం ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉందని మాత్రం చెబుతున్నారు. భూ వాతావరణ చరిత్ర అంతా ఎల్ నినో, లా నినాల మధ్య ఊగిసలాడిన చరిత్రే అనీ, ఆ రెండింటి మధ్య సాధారణ వాతావరణం ఎక్కువ కాలం కొనసాగిన చరిత్ర గతంలో ఉండగా, ఇప్పుడది తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్ నినో రాక ఇటీవల దశాబ్దాలలో మరీ ముఖ్యంగా గత రెండు, మూడు దశాబ్దాలలో బాగా ఎక్కువయిందని వారు చెబుతున్నారు.

ఇప్పుడు ప్రపంచంలోని వివిధ షేర్ మార్కెట్లు కూడా ఎల్ నినో, లా నినా ప్రభావాలకు అనుగుణంగా స్పందించేందుకు అలవాటు పడ్డాయి. పలు ఆర్ధిక వ్యవస్ధలకు ఋతుపవన వర్షపాతమే ఆధారం కనుక అది సహజమే.

సోవియట్ రష్యా ఎందుకు కూలింది?

సోవియట్ రష్యా ఎందుకు కూలింది?

ఎస్.రామ కృష్ణా రావు:

Two three decades ago there was cold war between America & Russia. Both were competing for no1 position. But down the line Russia faded away and USA is actively participating in almost all parts of the world’s politics. Russia became neutral & insignificant. I would like to know what went wrong with USSR? In spite of having huge natural resources why USSR is not able to compete with USA. What are the main factors which let down Russia politically & financially and because of which USSR is not able to show it’s presence in world’s politics to the deserved extent​.

రెండు, మూడు దశాబ్దాల క్రితం వరకు అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. రెండూ నెంబర్ 1 స్ధానం కోసం పోటీ పడేవి. అనంతర కాలంలో రష్యా (ప్రాభవం) మాసిపోగా, అమెరికా దాదాపు ప్రపంచంలోని అన్నిచోట్లా రాజకీయాలు సాగిస్తోంది. రష్యా తటస్ధంగానూ, నిరర్ధకంగానూ అయిపోయింది. USSR కి అసలు ఏమైందో తెలుసుకోగోరుచున్నాను. భారీ మొత్తంలో సహజ వనరులు ఉన్నా, USAతో USSR ఎందుకు పోటీపడలేకపోతోంది? రష్యా రాజకీయంగానూ, ఆర్ధికంగానూ బలహీనపడడానికి దారితీసిన కారణాలూ, తద్వారా ప్రపంచ రాజకీయాల్లో USSR తన ఉనికిని తగిన విధంగా రుజువు చేసుకోలేకపోవడానికి కారణాలు ఏమిటి?

సమాధానం:

ఈ అంశాన్ని నేను గత ఆర్టికల్స్ లో ఒకే చోట రాయకపోయినప్పటికీ, ఆయా సందర్భాలు వచ్చినప్పుడు కొంత కొంత కవర్ చేశాను. ఒకే చోట ఉంటే పాఠకులకు కూడా ఉపయోగం.

USSR పూర్తి రూపం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. 1917లో లెనిన్, ట్రాట్స్కీ తదితర నేతల నాయకత్వంలో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీలో (ఆర్.ఎస్.డి.ఎల్.పి) ఒక అర్ధ భాగంగా ఉన్న బోల్షివిక్కులు (రెండో అర్ధ భాగం మెన్షివిక్కులు) జార్ చక్రవర్తి పాలనపై తిరుగుబాటు చేసి సోషలిస్టు విప్లవాన్ని విజయవంతం చేసుకున్నారు. వాస్తవానికి 1917లో అక్కడ రెండు విప్లవాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఫిబ్రవరి విప్లవం. రెండోది అక్టోబర్ విప్లవం.

ఫిబ్రవరి విప్లవం, జార్ చక్రవర్తి పాలనకు వ్యతిరేకంగా రష్యాలోని పెట్టుబడిదారీ శక్తులు, కార్మికవర్గం, రైతులు, ఇతర మధ్యతరగతి వర్గాలు నిర్వహించి విజయవంతం చేసిన విప్లవం. ఫిబ్రవరి విప్లవంతోటే రాజ్యాధికారం కార్మిక వర్గం (శ్రామికులు) చేతికి రాలేదు. ఫిబ్రవరి విప్లవానంతరం బూర్జువా వర్గం లేదా పెట్టుబడిదారీ వర్గం అధికారాన్ని చేజిక్కించుకుంది. బూర్జువా వర్గానికి మెన్షివిక్కులు పరోక్ష మద్దతు ఇచ్చారు. కార్మిక వర్గం రాజ్యాధికారం చేజిక్కించుకోవాలన్న లెనిన్ వాదనను మెన్షివిక్కులు తృణీకరించారు. మొరటువాళ్ళకు రాజ్యాధికారం ఏమిటని ఈసడించారు.

తీవ్ర నిర్బంధం రీత్యా, అప్పటికి ప్రవాసంలో ఉన్న లెనిన్ రష్యా వచ్చి కార్మిక వర్గం తరపున, అశేష శ్రామిక ప్రజా వాహిని తరపున అత్యంత తెలివైన, అత్యంత సాహసోపేతమైన, అత్యంత అనూహ్యమైన రాజకీయ, మిలట్రీ, విప్లవకర ఎత్తుగడలు పన్నాడు. ఫిబ్రవరి నుండి అక్టోబర్ వరకూ దేశంలో చిక్కనైన అశాంతి, అలజడి, తిరుగుబాట్లు కొనసాగాయి. చేతికి చిక్కిన అధికారం నిలబెట్టుకోవడానికి బూర్జువావర్గం, వారికి మద్దతుగా అమెరికన్, యూరోపియన్ సామ్రాజ్యవాద ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు సాగించాయి. కానీ లెనిన్ ఇచ్చిన ప్రజా నినాదాల ముందు వారి ఎత్తుగడలు సాగలేదు. ఆర్.ఎస్.డి.ఎల్.పిలో మెన్షివిక్కులతో పోలిస్తే అప్పటివరకూ మైనారిటీగా ఉన్నప్పటికీ దేశంలో విస్తారమైన ప్రజా పునాదిని బోల్షివిక్కులు కలిగి ఉన్నారు. ఈ పరిస్ధితుల్లో లెనిన్ అక్టోబర్ లో సోషలిస్టు తిరుగుబాటుకు కార్మికవర్గానికి పిలుపు ఇచ్చారు.

అక్టోబర్ విప్లవం విజయవంతం అయిన తీరు, మొరటు-సంస్కారవిహీన-నిరక్షర కుక్షులైన అశేష కార్మిక జనులు అత్యంత సాహసోపేతంగా నగరాలను వశం చేసుకున్న విధము, అత్యంత సమయ స్ఫూర్తితో లెనిన్ ఇచ్చిన రాజకీయ నినాదాలు ప్రజల్ని మూకుమ్మడిగా బోల్శీవిక్కుల వెంట నడిపించిన తీరు… ఇవన్నీ తెలుసుకోవాలంటే అప్పటి అమెరికా విలేఖరి జాన్ రీడ్ రాసిన ‘ప్రపంచాన్ని కుదిపేసిన ఆ పది రోజులు’ (Ten Days That Shook the World) పుస్తకాన్ని చదవాల్సిందే.

[విప్లవం సాగినన్నాళ్లూ మాస్కోలోను, ఇతర నగరాల్లోనూ గడిపి ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూసిన జాన్ రీడ్, అమెరికాకు తిరిగి వెళ్ళాక ఆయన తయారు చేసుకున్న నోట్సు, వివిధ రాత ప్రతుల భాగాలు, ఇంటర్వ్యూలు అన్నింటినీ అమెరికా ప్రభుత్వం లాగేసుకుంది. అప్పటికే ఆయన పని చేసిన పత్రికను కూడా మూసేసింది. జాన్ రీడ్ దాదాపు ఏడెనిమిది నెలలు పోరాడితే గానీ ఆయన నోట్సులో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వలేదు. నోట్సు తన చేతికి వచ్చిన వెంటనే పది రోజుల పాటు రాత్రింబవళ్లూ కూర్చొని ఏకధాటిగా రాసి పుస్తకం పూర్తి చేశాడు. ఆయన పత్రిక పని చేయనందున మరో పబ్లిషర్ సహాయంతో పుస్తకాన్ని తీసుకురాగలిగాడు. ఈ పుస్తకం ఎంతగా ప్రజాదరణ పొందిందంటే కరడుగట్టిన పచ్చి పెట్టుబడిదారీ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సైతం టాప్ 100 పుస్తకాల్లో 7వ పుస్తకంగా 1999లో ప్రకటించింది. లెక్కలేనన్ని ముద్రణలు పొందిందా పుస్తకం. అనేక భాషల్లోకి తర్జుమా చేయబడింది. తెలుగులోకి కూడా. తెలుగు పుస్తకం ప్రస్తుతం మార్కెట్ లో ఉందో లేదో తెలియదు గానీ ఆంగ్ల ప్రతిని ఇంటర్నెట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.]

పది రోజులపాటు సాగిన అక్టోబర్ సోషలిస్టు విప్లవంతో రష్యాలో, ఆ మాటకొస్తే ప్రపంచంలో మొట్టమొదటి సోషలిస్టు రాజ్యం ప్రతిష్టించబడింది. పసికూనగా ఉండగానే సోషలిస్టు దేశం గొంతు నులిమి చంపేయడానికి ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలూ, రవి అస్తమించని దుర్మార్గపూరిత వలస రాజ్యాలూ కంటికి కునుకు లేకుండా ప్రయత్నాలు సాగించాయి. 3 సంవత్సరాల పాటు రష్యాను అన్నిరకాలుగా చుట్టుముట్టి తీవ్ర కష్టాలకు గురి చేశాయి. వ్యాపారం చేయడానికి నిరాకరించాయి. దేశం నిండా గూఢచారులను దింపి బోల్శివిక్ పార్టీ నాయకులను, కార్యకర్తలను చంపించాయి. ఆంక్షలు విధించి రష్యా ప్రజలను ఆకలికి మలమల మాడేలా చేశాయి. లెనిన్ తదితర విప్లవ నాయకులకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాపితంగా అనేక కట్టుకధలు అల్లి ప్రచారం చేశాయి. కృత్రిమ కరువు సృష్టించి ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశాయి. కానీ జనం మెజారిటీ బోల్షివిక్కుల పక్షానే నిలవడంతో పెట్టుబడిదారీ దేశాలే విసిగిపోయాయి. ఆ విధంగా ప్రపంచంలో మొట్టమొదటి సోషలిస్టు రాజ్యం బాలారిష్టాలను (నిజానికి కఠిన కంటక ప్రాయ కాలాన్ని) అధిగమించింది.

లెనిన్ అనంతరం సోషలిస్టు సోవియట్ పగ్గాలు చేపట్టిన స్టాలిన్ బోల్షివిక్కు పార్టీలోనే పెట్టుబడిదారీ అనుకూల శక్తులు ప్రవేశించాయని పసిగట్టాడు. ప్రవేశించడమే కాకుండా దేశాన్ని తమ గుప్పెట్లో తీసుకుని సోషలిస్టు నిర్మాణాన్ని నాశనం చేయాలని, దేశాన్ని తిరిగి పెట్టుబడిదారీ వ్యవస్ధవైపుకి మళ్ళించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని గ్రహించాడు. దానితో ఆయన పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ క్రమంలో లెనిన్ నుండి కొన్ని విమర్శలు కూడా ఆయన ఎదుర్కొన్నాడు. లెనిన్ మరణంతో విప్లవ ప్రతీఘాతక శక్తులు విజృంభించకుండా ఉన్నాయంటే అది స్టాలిన్ చలవే. స్టాలిన్ నేతృత్వంలో సోవియట్ రష్యా అనతికాలంలోనే సుసంపన్నమైన దేశంగా ఎదిగింది. అమెరికా అభివృద్ధి చెందడానికి 300 యేళ్ళు పడితే సోవియట్ రష్యా అభివృద్ధి చెందడానికి కేవలం 30 సంవత్సరాలు మాత్రమే పట్టిందంటే కారణం సోవియట్ రష్యా ఎంచుకున్న మార్గమే.

ఒక మనిషిని మరొక మనిషి దోచుకునేందుకు ఎటువంటి అవకాశం లేకుండా కార్మికవర్గ నియంతృత్వాన్ని (ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యం పేరుతోనూ, వివిధ ఆటోక్రాట్ల నేతృత్వంలోనూ నడుస్తున్న రాజ్యాలన్నీ వాస్తవానికి బూర్జువా నియంతృత్వ రాజ్యాలు.) స్టాలిన్ పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాడు. పెట్టుబడిదారీ దేశాలు నిరంతరం కుట్రలు సాగిస్తున్న నేపధ్యంలో కూడా స్టాలిన్, సోవియట్ కమ్యూనిస్టు పార్టీలు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాయి. జర్మనీ నియంత హిట్లర్ మొదట ఆక్రమించింది చేకొస్లోవేకియా, పోలాండ్ ఫ్రాన్స్ దేశాలనే అయినా అతని అంతిమ లక్ష్యం సోవియట్ రష్యాయే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర రాజ్యాలు కూడా హిట్లర్ మొదట సోవియట్ రష్యా మీదికే వెళ్లాలని ఆశించాయి. ఈ సంగతి గ్రహించిన స్టాలిన్ తెలివిగా హిట్లర్ తో నిర్యుద్ధ సంధి చేసుకున్నాడు. ఆ సంధిని తుంగలో తొక్కిన హిట్లర్, కొద్దికాలానికి సోవియట్ రష్యా మీదికి దండు వెళ్ళి తన మరణశాసనాన్ని తానే లిఖించుకున్నాడు.

యుద్ధంలో సైనికులు, సైనికాధిపతులు యుద్ధరంగంలో తలమునకలై గాయాల పాలవుతుంటే దేశాధినేతలు ఏం చేస్తారు? తమ తమ రాజ మందిరాల్లో కూర్చొని ఆదేశాలు ఇస్తుంటారు. ఆజ్ఞలు జారీ చేస్తారు. ఆజ్ఞలు అమలు చేయని సైనికాధికారుల్ని శిక్షలకు గురి చేస్తుంటారు. సైనికుల వందనాలు స్వీకరిస్తూ ఉంటారు. కానీ స్టాలిన్ చేసింది అది కాదు. ఆయన స్వయంగా యుద్ధరంగంలోకి దుమికాడు. స్వయంగా గుర్రపు స్వారీ చేస్తూ సైనికులతో కదం కలిపాడు. స్వయంగా మిలట్రీ ఎత్తుగడలను రచించాడు. స్వయంగా సైన్యాలను పరామర్శించాడు. స్వయంగా కందకాల వద్దకు వెళ్ళి సైన్యానికి ప్రోత్సాహం అందించాడు. మొత్తం దేశాన్నే ఉత్తేజితం కావించి ప్రతి పౌరుడిని ఒక్కొక్క కరడుగట్టిన దేశ భక్తుడిగా మార్చాడు.

సోవియట్ రష్యాపై దాడిలో నిజానికి రష్యా పనైపోయిందనే ప్రారంభంలో అనుకున్నారు. ఉక్రెయిన్ లో తనకు అనుకూలమైన నాజీ శక్తులను తయారు చేసుకుని (వారి వారసులే ఇప్పుడు ఉక్రెయిన్ ని వినాశనం వైపుకి తీసుకెళ్తున్నారు) తన సైన్యాన్ని ఉక్రెయిన్ ని దాటించాడు హిట్లర్. వారిని మాస్కో వరకూ స్టాలిన్ రానిచ్చాడు. ఇకనేముంది మాస్కో వశం కావడమే తరువాయి అని పశ్చిమ రాజ్యాలు (అమెరికాతో సహా) చంకలు గుద్దుకున్నారు. కానీ మాస్కోలో అద్వితీయమైన యుద్ధ కళాకౌశలాన్ని నాజీలకు రుచి చూపాడు స్టాలిన్. స్వయంగా సైన్యానికి నాయకత్వం వహించి ప్రజల సహాయంతో హిట్లర్ సైన్యాన్ని రెండుగా చీలిపోయేలా చేశాడు. ఆయన నేతృత్వంలోని సైన్యం సమారోత్సాహంతో హిట్లర్ సాయినికులని నిలువునా చీల్చితే వెనుకవైపు నుండి కుడి, ఎడమల నుండి దాడి చేయించాడు. ఆ దెబ్బతో హిట్లర్ సైన్యం నిలువునా నీరుగారిపోయింది. అంతులేని మానవ విధ్వంసం ఆనాడు మాస్కోలో చోటు చేసుకుంది.

రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ నిర్వహించిన మరో బృహత్కార్యం దేశ ఆర్ధిక వ్యవస్ధకు పట్టుగొమ్మలయిన మహా మహా భారీ పరిశ్రమలను లోపలికి తరలించడం. ఇది సాధ్యమని బహుశా అప్పటివరకూ ఎవరూ ఊహించి ఉండరు. కానీ అసాధ్యాల్ని సుసాధ్యం చేయడం రాజుల చేతగాదు గానీ ప్రజలకు చిటికెలో పని. అశేష శ్రామికజన సమూహం తోడు నిలవగా ఐరోపా సరిహద్దుల్లో కేంద్రీకరించబడిన పరిశ్రమలను లోపలికి తరలించి అక్కడ పునర్నిర్మాణం కావించాడు. ఇదంతా ఎందుకంటే హిట్లర్ ప్రధాన లక్ష్యం తామే అని, కమ్యూనిస్టు రాజ్యాల నిర్మూలనే హిట్లర్-ముసోలినిల లక్ష్యం అనీ, అందుకోసం వారికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర రాజ్యాలు కూడా దన్నుగా ఉంటాయని స్టాలిన్ కి తెలుసు గనుక.

నాజీలు దాడి చేస్తే, ఆ దాడిలో పరిశ్రమలు నాశనం అయితే ఆర్ధిక వ్యవస్ధ నష్టపోతుంది. ఆర్ధిక వనరులైన పారిశ్రామిక శక్తి అందుబాటులో లేకపోతే యుద్ధంలో సరఫరాలు లేక త్వరలోనే ఓటమి తధ్యం అవుతుంది. ఈ ముందు చూపుతో ఒక పక్క హిట్లర్ ఐరోపాలో జైత్రయాత్ర సాగిస్తుంటే మరో పక్క రష్యాలో ఆర్ధిక వ్యవస్ధకు ప్రాణాధారమైన పారిశ్రామిక రంగాన్ని మరోచోట పునర్మించడంలో స్టాలిన్ దృష్టి పెట్టాడు. ఇది ప్రజలవల్లనే సాధ్యపడింది తప్ప మరొకరి వల్ల కాదు. అప్పుడు రష్యాలు పెట్టుబడిదారీ వర్గాలు లేవు. ఉన్నదంతా ప్రజలే. సోషలిస్టు వ్యవస్ధలో తిని కూర్చునే వెధవలు ఉండరు. ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో నిమగ్నమై ఉంటారు. ఆ విధంగా ప్రజలు మొట్టమొదటి సోషలిస్టు రాజ్యాన్ని పెట్టుబడిదారీ నియంతృత్వ దాడి నుండి కాపాడుకున్నారు.

Red flag over German Parliament -May 2, 1945

మొదటి భాగం తరువాయి…………

ఆ విధంగా సోవియట్ రష్యా ప్రజల సహాయంతో స్టాలిన్, మొట్టమొదటి సోషలిస్టు రాజ్యానికి ఎదురైన అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొన్నాడు. కానీ సోషలిస్టు రాజ్యం వయసు అప్పటికి ఇంకా బాల్య దశలోనే ఉంది తప్ప పరిపక్వ దశకు చేరుకోలేదు. సోషలిస్టు నిర్మాణం నిరంతర సవాళ్లను ఎదుర్కొంటూ చేయవలసిన ప్రయాణం. ఒక కుటుంబాన్ని సక్రమంగా నిర్మించుకోవాలంటేనే కిందిమీదులు అవుతుంటాం. అలాంటిది అనేక జాతులతోనూ, ప్రజా సమూహాలతోనూ, ప్రాంతాలతోనూ కూడి ఉండే బహుళజాతుల వ్యవస్ధను పాత సమాజం మిగిల్చిన అనేకానేక కళంకాలను, ఆటంకాలను అధిగమిస్తూ నూతన వ్యవస్ధను నిర్మించుకోవాలంటే ఇంకెంత కష్టమో ఎవరికి వారే ఊహించుకోవాల్సిన విషయం.

ఈ క్రమంలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంలో ఎదురవుతున్న ఆటంకాలను వివరిస్తూ స్టాలిన్ పలు రచనలు చేశారు. దేశంలో ఆర్ధిక వర్గాలు నశించాయన్న తన అవగాహన తప్పని వెల్లడించాడు. దేశంలో ఆర్ధిక వర్గాలు ఇంకా కొనసాగుతున్నాయని, కానీ అవి మునుపటి వ్యవస్ధలో వలే స్పష్టంగా కనిపించకుండా ఎర్ర జెండా ముసుగు వేసుకుని, ప్రగతిశీల భావాలు వల్లిస్తూ చివరికి సోవియట్ కమ్యూనిస్టు పార్టీలో కూడా చొరబడ్డాయని ఆయన గ్రహించి తన తప్పును సవరించుకున్నాడు. ఆర్ధిక వర్గాలు కొనసాగుతున్నందున వర్గపోరాట కర్తవ్యం మిగిలే ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే సోషలిస్టు వ్యవస్ధలో వర్గ శత్రువు స్నేహపూరిత  ముసుగు వేసుకున్నందున నూతన వర్గపోరాటం మరింత కష్టంగా ఉంటుందని విశదీకరించాడు.

స్టాలిన్ మొట్టమొదటి సోషలిస్టు రాజ్యాన్ని కాపాడుకునే క్రమంలో అవిరామంగా కృషి చేశాడు. ఆ క్రమంలో కొన్ని తప్పులకు పాల్పడ్డాడు. తప్పులు ఏమన్నా ఉంటే అవి ఆయన తెలిసి చేసినవి కావు. సోషలిస్టు రాజ్యాన్ని కాపాడడంలో, పటిష్టంగా నిర్మించడంలోనూ ఆయన ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేది కింది కమిటీలు, కింది కార్యకర్తలు. ఆయన ఎన్ని జాగ్రత్తలు చెప్పినప్పటికీ ఆయన ఆదేశాలను సరిగ్గా అన్వయించడంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ప్రతినిధులు కొన్ని అతి చర్యలకు పాల్పడ్డారు. ఇవి అనివార్యంగా స్టాలిన్ కి అంటగట్టబడ్డాయి. నిరంతరం మెలకువగా ఉండడానికి ప్రయత్నాలు చేసినా వ్యవస్ధ నిర్మాణ క్రమం అనేది ఎప్పుడూ పుస్తకాల్లో ఉన్నట్లుగా జరగదు. పుస్తకానికీ, ఆచరణకీ నిత్యం ఒక ఎడమ/అంతరం/వైరుధ్యం కొనసాగుతూ ఉంటుంది. ఈ ఎడమను ఎంత త్వరగా పూడ్చగలిగితే అంత ఉపయోగం. దానికి మళ్ళీ పార్టీ పైనా, ప్రజలపైనా ఆధారపడవలసిందే.

Joseph Stalin

కానీ ఈ లోపుగా స్టాలిన్ కు ముదిమి వయసు మీదపడింది. ఆయన బ్రతికి ఉండగానే కమ్యూనిస్టు పార్టీలో చేరిన పెట్టుబడిదారీ శక్తులు అదను కోసం కాచుకుని కూర్చున్న పరిస్ధితిలో మార్చి 5, 1953 తేదీన స్టాలిన్ మరణించారు. అప్పటికే ఆయన వయస్సు 75 సం.లు. ఆయన మరణంతోనే సోవియట్ కమ్యూనిస్టు పార్టీలో అధికారం కోసం కుమ్ములాట మొదలైంది. జార్జి మలెంకోవ్ అనే ఆయన పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టినా, రెండేళ్లలోనే ఆయనను కూల్చి నికిటా కృశ్చెవ్ అధికారం చేపట్టాడు. మలెంకోవ్ కాలంలోనే పెట్టుబడిదారీ శక్తులు దాదాపు అన్ని అధికార స్ధానాలను కైవసం చేసుకున్నారు. సోషలిస్టు నిర్మాణాన్ని ఎంత వేగంగా వెనక్కి తిప్పాలన్న అంశంపైనే అప్పటి నుండి తగాదాలు, కుట్రలు, కూల్చివేతలు కొనసాగాయి. ఇవి గోర్బచెవ్-యెళ్ట్సిన్ ల వరకూ కొనసాగాయి.

అత్యంత తిరోగామి చర్యలను తీసుకున్న ఘనత మొదట కృశ్చెవ్ కు దక్కుతుంది. ఆయన ఏలుబడిలో కమ్యూనిస్టు/సోషలిస్టు సిద్ధాంతాలకే చెదలు పెట్టించే కార్యక్రమం శరవేగంగా మొదలయింది. ఆయన తన మొట్టమొదటి దాడి స్టాలిన్ నుండే ప్రారంభించాడు. స్టాలిన్ బ్రతికి ఉన్నంతవరకూ కుక్కిన పేనులా పడిఉన్న కృశ్చెవ్ అధికారంలోకి వచ్చాక స్టాలిన్ పైన అమెరికా-ఐరోపాలు కూడా ఊహించని విధంగా దాడి చేశాడు. అనరాని మాటలు అన్నాడు. స్టాలిన్ హయాంలోని అసంతృప్త వర్గాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వారంతా కృశ్చెవ్ నీడన జమ కూడారు. సోషలిస్టు నిర్మాణంలో కింది కమిటీలు, కార్యకర్తల తప్పులకు బాధితులుగా మిగిలిన వారు కూడా వెనకా ముందూ చూడకుండా కృశ్చెవ్ నీడన చేరారు. వారంతా తమకు తెలిసి కొందరూ, తెలియకుండా అనేకులూ అత్యద్భుతమైన సోషలిస్టు రాజ్యాన్ని లోపలి నుండి తొలిచి వేయడం మొదలు పెట్టారు.

సిద్ధాంత రంగంలో కూడా కృశ్చెవ్ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేశాడు. వర్గసంకర సిద్ధాంతాలకు పునాది వేశాడు. ఆర్ధిక వర్గాలు నిజానికి ఉప్పు-నిప్పు గా ఉంటాయి. పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటూనే పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉంటారు. అలాంటి విరుద్ధ వర్గాల మధ్య శాంతి సాధ్యమని కృశ్చెవ్ ప్రబోధించాడు. శాంతియుత పోటీ, శాంతియుత పరివర్తన, శాంతియుత సహజీవనం అంటూ మూడు శాంతి సూత్రాలు ప్రతిపాదించి మార్క్సిజం సారాన్ని నిరాకరించాడు. ఆయన వెంట పలు కమ్యూనిస్టు  రాజ్యాలు వెళ్ళగా మావో నేతృత్వంలోని చైనా ఎదురోడ్డి సైద్ధాంతీక పోరాటం సాగించింది. కృశ్చెవ్ సూత్రాలు ఎంత నాసికరమో, మానవాళికి ఎంత వినాశకరమో అప్పట్లో రష్యా-చైనా ల మధ్య పెద్ద చర్చ సాగింది. ఆ చర్చను ‘గ్రేట్ డిబేట్’ అని పిలుస్తారు. సిద్ధాంతరంగంలో మావో చేతిలో చావు దెబ్బ తిన్నప్పటికీ కృశ్చెవ్ తన దేశంలో తన సూత్రాలను అమలు చేస్తూ దేశాన్ని పెట్టుబడిదారీ వ్యవస్ధవైపుకి తీసుకెళ్ళాడు.

కృశ్చెవ్ కి సంబంధించి మరో ముఖ్యమైన అంశం ఆయన సాగించిన ప్రపంచాధిపత్య పోటీ. అమెరికాతో ఆయన ప్రపంచాధిపత్యం కోసం పోటీ పడడం ప్రారంభించాడు. నిజానికి పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్ధ, సామాన్య ప్రజల సోషలిస్టు వ్యవస్ధలు పరస్పర విరుద్ధ శక్తులు. పెట్టుబడిదారీ వ్యవస్ధ దోపిడీ వ్యవస్ధకు కొమ్ము కాస్తే సోషలిస్టు వ్యవస్ధ శ్రామిక ప్రజల పక్షాన నిలుస్తుంది. కాబట్టి ఈ రెండూ ఒకదానినొకటి ఘర్షణ పడక తప్పదు. కానీ ఆ ఘర్షణ ప్రపంచాధిపత్యం రూపంలో ఉండదు. ఒక సోషలిస్టు రాజ్యం మహా అయితే మరో పెట్టుబడిదారీ దేశంలోనో, మరో మూడో ప్రపంచ దేశంలోనో సోషలిస్టు విప్లవాలు విజయవంతం కావడానికి సహాయ, సహకారాలు ఆందించగలదు. అంతర్జాతీయ వేదికలపై పీడిత ప్రజల, జాతుల, దేశాల తరపున వాణి వినిపించగలదు. అంతే తప్ప తానే మూడో ప్రపంచ దేశాలను ఇతర రాజ్యాలను తన ప్రభావంలోకి తెచ్చుకోవడానికీ, తన ఉపగ్రహ రాజ్యాలుగా మార్చుకోవడానికి సోషలిస్టు రాజ్యం ప్రయత్నించదు. అది సోషలిస్టు రాజ్యం లక్షణం, లక్ష్యం కానే కాదు.

కానీ కృశ్చెవ్ అమెరికాతో పోటీ పడుతూ రష్యా ప్రభావ ప్రాంతాలను విస్తరించడంలో దూకుడుగా వ్యవహరించాడు. ఈ ఒక్క లక్షణం చాలు ఆయన సోషలిస్టు నిర్మాణంలో లేడనీ, మరో పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశంగా రష్యాను మార్చాడనీ చెప్పడానికి. సామ్రాజ్యవాద పోటీలోకి దిగి ప్రపంచ దేశాలను మార్కెట్ దేశాలుగా పరిగణిస్తూ సామ్రాజ్య విస్తరణకు ప్రయత్నించాలంటే పెద్ద ఎత్తున ఆయుధ శక్తి అవసరం అవుతుంది. భారీ సైనిక శక్తిని పోషించాల్సి ఉంటుంది. బడ్జెట్ లో భారీ మొత్తాన్ని మిలట్రీ వ్యయానికి కేటాయించాల్సి వస్తుంది. కృశ్చెవ్ అదే చేశాడు. చివరికి పరిస్ధితి ఎలా మారిందంటే కృశ్చెవ్ కాలంలోనూ, ఆ తర్వాతా కూడా అమెరికా కంటే రష్యాయే ఎక్కువ దూకుడుగా సామ్రాజ్యవాద పెత్తందారీ దేశంగా అవతరించింది. ఆఫ్ఘనిస్ధాన్ లాంటి దేశాలను దురాక్రమించింది. ప్రపంచంలో అనేకచోట్ల వేలు పెట్టింది. అమెరికా ఒకటి చేస్తే తాను రెండు చేసేందుకు ప్రయత్నించింది. అనేక పేద దేశాలు, అక్కడి ప్రజలు అమెరికా-రష్యా ల పోటీ మధ్య నలిగిపోయారంటే అతిశయోక్తి కాదు.

అయితే గోర్భచెవ్ పదవి చేపట్టే నాటికి రష్యా ఆర్ధిక వ్యవస్ధ సామ్రాజ్యవాద పోటీని మోయలేకపోయింది. ఆఫ్ఘన్ దురాక్రమణ ఆర్ధిక వ్యవస్ధకు పెను భారం అయింది. ప్రపంచవ్యాపితంగా విస్తరించిన మిలట్రీ స్ధావరాలు భారం అయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధ ఆర్ధిక వ్యవస్ధను రష్యా మోయలేకపోయింది. దానితో ఆర్ధిక వ్యవస్ధను చక్కబెట్టుకోవడానికి సైనిక స్ధావరాలను ఒక్కటోక్కటిగా ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. తన ఉపగ్రహ రాజ్యాల సమస్యలను ఆదుకోలేని పరిస్ధితిలో పడిపోయింది. చివరికి ఆఫ్ఘన్ నుండి కూడా సైన్యాన్ని ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో యుద్ధ ఆర్ధిక వ్యవస్ధ వల్ల ప్రజలకు సౌకర్యాలు అందడం తగ్గిపోతూ వచ్చింది. పాత సోవియట్ సోషలిస్టు తరం అంతరించి సోషలిజం అంటే ఏమిటో తెలియని తరం సోవియట్ డెమొగ్రఫీని ఆక్రమించింది.

The duo that lead Soviet disintegration -Gorbachev and Yeltsin

దేశ పరిస్ధితిని ప్రజలకు చెప్పాల్సిన అవసరం తరుముకు రావడంతో గోర్బచెవ్ 1990లో పెరిస్త్రోయికా, గ్లాస్తనోస్త్ అనే ద్విసూత్రాలను ప్రతిపాదించి అమలు చేశాడు. ఇవి అసలు సూత్రాలు అని చెప్పదగ్గవి కూడా కాదు. ఆర్ధిక వ్యవస్ధ పతనం అంచుకు చేరి అగ్రరాజ్య ప్రతిష్టను కూడా భారమైపోయిన దశలో సోషలిస్టు ముసుగుని తొలగించుకోవలసిన అత్యవసరం గోర్బచెవ్ ప్రభుత్వానికి వచ్చింది. ‘అయ్యా మనము/మేము సోషలిస్టు దేశం కాదు. అగ్ర రాజ్యం కూడా కాదు’ అని చెప్పుకోవడమే గోర్భచెవ్ వల్లించిన ద్విసూత్రావళి.

ఇక్కడే గోర్భచెవ్, యెల్టిసిన్ ల మధ్య ఒక వైరుధ్యం వచ్చింది. ముందు చెప్పినట్లుగా ‘ఎంత త్వరగా ముసుగు తొలగిద్దాం’ అన్న అంశంలో వచ్చినదే ఈ వైరుధ్యం. ముసుగుని నిలువునా, అడ్డంగా చీరేసి బదాబదలు చేసేద్దాం అని యెల్టిసిన్ ఒత్తిడి చేశాడు. ‘అలా చేస్తే కాస్త ప్రతిష్ట కూడా లేకుండా పలచబడతాం. గౌరవం ఉండదు. తలెత్తుకోలేం. మెల్లమెల్లగా ముసుగు తొలగిద్దాం” అని గోర్బచేవ్ ప్రతిపాదించాడు. అమెరికా, తదితర పశ్చిమ రాజ్యాలు అప్పటికే యెల్టిసిన్ వెనుక నిలిచాయి. ఆయనకు అనుకూలంగా తమ సొంత ఎన్.జి.ఓ సంస్ధల చేత ప్రజలను కూడగట్టి భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. ఈ నిరసనకారుల్లో పశ్చిమ రాజ్యాలు కూడగట్టింది కొద్దిమందినే. కానీ మలెంకోవ్, కృశ్చెవ్ ల కాలం నుండి అమలు చేస్తున్న యుద్ధ ఆర్ధిక విధానాలతో క్రుంగిపోయిన జనం కూడా వారితో జతకలిశారు. ప్రజల న్యాయమైన అసంతృప్తి యెల్టిసిన్ కు, ఆయన వెనుక ఉన్న పశ్చిమ దేశాలకు కలిసి వచ్చింది.

యెల్టిసిన్ అచ్చంగా అమెరికా మనిషి. సోవియట్ రష్యా ప్రజల పాలిట పెద్ద విలన్. రష్యా ప్రజల వేళ్ళతోనే రష్యా ప్రజల కళ్లను పొడిపించిన దేశద్రోహి. కానీ ఈ సంగతి జనానికి తెలియదు కదా. అమాయకంగా ఆయన వెంట వెళ్లారు. ఆర్ధిక సమస్యలతో సోవియట్ రష్యా జాతుల బందిఖానాగా మారి ఉండడంతో ఎప్పుడెప్పుడు విడిపోదామా అని వివిధ జాతులు కాచుకుని ఉన్నాయి. 1990 నాటి పరిణామాలతో వివిధ జాతులు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. ఆ విధంగా సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయింది.

విచ్ఛిన్నం అయింది సోవియట్ రష్యా అన్నది నిజమే. కూలిపోయింది సోవియట్ రష్యా అన్నదీ నిజమే. కానీ 1990 నాటికి సోవియట్ రష్యా, ‘సోషలిస్టు సోవియట్ రష్యా’ గా మిగిలి లేదు. అది పెట్టుబడిదారీ సోవియట్ రష్యాగా అప్పటికే మారిపోయి ఉంది. కాబట్టి 1990లో కూలిపోయిందీ, విచ్ఛిన్నం అయిందీ ‘పెట్టుబడిదారీ సోవియట్ రష్యా’యే తప్ప ‘సోషలిస్టు సోవియట్ రష్యా’ కాదు.

పెట్టుబడిదారీ వ్యవస్ధలో జాతులు అణచివేయబడతాయి. శ్రామిక ప్రజలు పీడించబడతారు. మాఫియాలు రాజ్యం చేస్తాయి. ఇదంతా ప్రజల్లో అసంతృప్తి ప్రోది చేస్తుంది. ఆ అసంతృప్తి 1990లో బద్దలై పెట్టుబడిదారీ సోవియట్ రష్యా కూలిపోవడానికి దారి తీసింది.

కనుక సోవియట్ రష్యా విచ్ఛిన్నం కావడానికి, కూలిపోవడానికి, అగ్రరాజ్య ఆధిపత్యం కోల్పోవడానికీ కారణం ఆ దేశంలో అంతర్గతంగా ఆర్ధిక వైరుధ్యాలు తలెత్తడము, సామ్రాజ్యవాద యుద్ధ ఆర్ధిక వ్యవస్ధను మోయలేక చతికిలబడడమూ. దేశంలో వనరులు ఉన్నంతనే సరిపోదు. ఆ వనరులను ఉత్పత్తిగా, ప్రజల ఆర్ధిక శక్తిగా మార్చగలిగితేనే అది ఆ దేశ శక్తిగా మార్పు చెందుతుంది. పెట్టుబడిదారీ సోవియట్ రష్యాలో ఆర్ధిక ఉత్పత్తి పంపిణీలో అసమానతలు తీవ్రంగా పెరిగాయి. ఉత్పత్తిలో అధికభాగం యుద్ధ ఆర్ధిక వ్యవస్ధ కోసం మళ్లించగా ప్రజలకు, శ్రామికులకు పంపిణీ చేయడానికి పెద్దగా మిగల్లేదు. కమ్యూనిస్టు పార్టీని, ప్రభుత్వ కంపెనీలను అంటిపెట్టుకుని వృద్ధి చెందిన నూతన పెట్టుబడిదారీ వర్గం ప్రజల అసంతృప్తిని అణచివేసేందుకు మాఫియాలను పెంచి పోషించారు. యెల్టిసిన్ ఏలుబడిలో ఈ మాఫియాలు మొత్తం దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ఇప్పటికీ మాఫియాల ఆధిపత్యం రష్యాలో కొనసాగుతోంది. కాకపోతే ఇప్పటి మాఫియా, ధనికవర్గాలకు జాతీయతా భావనలు ఉంటే యెల్టిసిన్ కాలంలో అమెరికా, పశ్చిమ రాజ్యాలకు దాసోహం అన్నాయి.

ఈ కారణం వల్లనే పుతిన్ అంటే అమెరికా, పశ్చిమ రాజ్యాలకు తగని విద్వేషం. యెల్టిసిన్ లాగా కాకుండా రష్యాను సొంత కాళ్లపై నిలబెట్టేందుకు పుతిన్ ప్రయత్నించడం పశ్చిమ రాజ్యాలకు ఇష్టం లేదు. ఆ మాటకొస్తే ఏ దేశమూ తన సొంత కాళ్లపై నిలబడడం వారికి ఇష్టం ఉండదు. ఈ రోజు సొంత కాళ్లపై నిలబడ్డవాడు రేపు ఉత్పత్తి పెంచుకున్నాక మార్కెట్ కోసం తిరిగి తమకే పోటీ వస్తారని వారికి తెలుసు. కనుకనే పుతిన్ పైన విపరీతమైన వ్యతిరేక ప్రచారాన్ని పశ్చిమ పత్రికలు సాగిస్తాయి. పుతిన్ సోషలిస్టు కావడం అటుంచి కనీసం ఎర్రజెండా పొడకూడా గిట్టని వ్యక్తి. కానీ జాతీయ భావాలు ఉన్న వ్యక్తి. తమ సంపద తమ దేశంలోనే ఉండాలని కోరుకునే వ్యక్తి. తమ సంపదలను పశ్చిమ రాజ్యాల దోపిడీకి ఇచ్చగించని వ్యక్తి. అందువలన ఎంతటి దుష్ప్రచారానికైనా ఆయన తగును.

పుతిన్ ఏలుబడిలో రష్యా మళ్ళీ శక్తులు కూడదీసుకుంటోంది. తన ప్రయోజనాల వరకూ అమెరికాకు ఎదురు నిలుస్తోంది. డాలర్ ఆధిపత్యాన్ని కూలదోసేందుకు తద్వారా అమెరికా తనకు సృష్టిస్తున్న సమస్యలను తొలగించుకునేందుకు కృషి చేస్తోంది. చైనాతో కలిసి యువాన్, రూబుల్ కరెన్సీల శక్తి పెంచేందుకు కృషి చేస్తోంది. అయితే తనకు ఆధిపత్యం అవసరం లేదని పుతిన్ చెబుతున్నాడు. ఆయనకి అవసరం లేకపోయినా పెట్టుబడిదారీ వ్యవస్ధ లక్షణం అది కాదు. ఉత్పత్తి పెంచుకుంటూ పోవడం, తద్వారా లాభాలు పెంచుకోవడం, ఉత్పత్తి అమ్మకానికి మార్కెట్ల వేటలో పడడం, ఆ క్రమంలో అవతలి పెట్టుబడిదారీ శక్తితో పోటీ పడడం… ఇది పెట్టుబడిదారీ వ్యవస్ధ సహజ లక్షణం. ఎవరు వద్దన్నా అది జరిగిపోతుంది. ఆ క్రమంలో పోటీ, ఘర్షణలు అనివార్యం. నలిగిపోయేది మాత్రం ప్రజలు.

Soucre: Telugu varthalu by V.Sekhar

రిట్రాస్పెక్టివ్ టాక్స్ అంటే

ప్రశ్న: రిట్రాస్పెక్టివ్ టాక్స్ అంటే?

GAAR

శ్రావణ్ కుమార్:

రిట్రాస్పెక్టివ్ టాక్స్ అంటే ఏమిటి? మీకు సమయం ఉంటే పూర్తి వివరాలు ఇవ్వగలరు.

సమాధానం:

రిట్రాస్పెక్టివ్ అంటే ఈ సందర్భంలో అర్ధం, గత కాలానికి కూడా వర్తించేది అని. ప్రభుత్వాలు చట్టాలు చేసేటప్పుడు ఆ చట్టం యొక్క స్వభావాన్ని బట్టి ఎప్పటి నుండి వర్తించేది కూడా చట్టంలో పొందుపరుస్తారు. వెంటనే అమలులోకి వచ్చేటట్లయితే ‘with immediate effect’ అంటారు. గతంలో నిర్దిష్ట తేదీ నుండి వర్తింపజేయాలని భావిస్తే ఆ తేదీని చట్టంలో పొందుపరుస్తారు. ఇలా గతించిన కాలానికి కూడా వర్తించే విధంగా చేయడాన్ని ‘రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్’ అంటారు.

వోడా ఫోన్ పన్ను ఎగవేత సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ GAAR అనే చట్టాన్ని తయారు చేసారు. పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించింది కూడా. General Anti-Avoidance Rules పేరుతో చేసిన చట్టం ఆదాయ పన్ను చట్టానికి అనుబంధంగా అమలు చేయాలని తలపెట్టారు. చట్టం అయితే చేశారు గానీ దానిని అమలు చేసే దమ్ము గత, ఇప్పటి ప్రభుత్వాలకు లేకపోయింది. ప్రణబ్ ను రాష్ట్రపతిగా పంపించిన తర్వాత ఆర్ధిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన చిదంబరం చట్టం అమలును 5 సం.లు వాయిదా వేశారు.

ఈ చట్టానికి వ్యతిరేకంగా బి.జె.పి ఎన్నికల్లో ప్రచారం చేసింది కూడా. కానీ చట్టాన్ని నేరుగా ప్రస్తావించకుండా ‘విదేశీ పెట్టుబడులను బెదరగొట్టే విధానాలను అనుసరించం’ అనీ, ‘పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టిస్తాం’ అనీ, ‘అంచనా వేయదగిన పన్నుల విధానాన్ని (predictable tax policy) తెస్తాము’ అనీ బి.జె.పి ప్రచారం చేసింది. అధికారం చేపట్టిన తర్వాత GAAR ను రద్దు చేస్తారా అని అడిగితే ఆర్ధిక మంత్రి, బి.జె.పి నేతలు నేరుగా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు. ఈ చట్టాన్ని అమలు చేసే ఉద్దేశ్యం తమకు లేదని బడ్జెట్ లో పరోక్షంగా సూచించడం తప్ప నేరుగా చెప్పలేదు. నేరుగా చెబితే విమర్శలు వస్తాయని భయం. అలాగని ధైర్యం చేసి రద్దు చేస్తే ప్రజల్లో పలచన అవుతామని మరో భయం.

ఆదాయ పన్ను చట్టం అమలులోకి వచ్చిన నాటి నుండి, అనగా గత 50 యేళ్ళ నాటి నుండి GAAR అమలులోకి వచ్చేలా తయారు చేశారు. ఈ చట్టం అమలు చేస్తే లక్షల కోట్ల ఆదాయం భారత ఖజానాకు సమకూరుతుంది. కనీసం గత 5 సం.ల నుండి అమలు చేసినా అధమం లక్ష కోట్లు వసూలు అవుతుందని ఒక అంచనా.

స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలు పన్నులు ఎగవేయడానికి వందల కొద్దీ పేపర్ కంపెనీలను స్ధాపిస్తాయి. ఈ పేపర్ కంపెనీలు పన్నులు తక్కువగా ఉండే చిన్న చిన్న దేశాల్లో స్ధాపిస్తారు. వాస్తవంగా వ్యాపారం ఏమో ఇండియా లాంటి

Source: Business Today

దేశాల్లో చేస్తారు. అలా వచ్చే లాభాలను తీసుకెళ్ళి పేపర్ కంపెనీల్లో జమ చేస్తారు. తద్వారా వ్యాపారం చేసే దేశాల్లో అమ్మకపు పన్ను, కేపిటల్ గెయిన్స్ పన్ను ఎగవేస్తారు. ఈ విధంగా పన్నులు ఎగవేయడంలో యాపిల్ కంపెనీ అగ్రభాగాన ఉండగా దాదాపు బహుళజాతి కంపెనీలన్నీ ఈ పద్ధతిలో లాభాలు మూట గడుతున్నాయి.

హచిసన్స్ కంపెనీ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసిన వోడా ఫోన్ కంపెనీ లక్ష కోట్ల కేపిటల్ గెయిన్స్ లాభం పొందింది. కానీ కొనుగోలు చేసిన కంపెనీ మాల్దీవులలో ఉన్నట్లుగా చూపింది. దానితో ఇండియాకు రావలసిన 10,000 కోట్ల రూపాయల పన్ను రాకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆదాయ పన్ను శాఖ టాక్స్ డిమాండ్ ను వోడా ఫోన్ కంపెనీ ముందు ఉంచింది. కంపెనీ కోర్టుకు వెళ్లింది. వివిధ దశలు దాటి సుప్రీం కోర్టు వరకు కేసు వెళ్లింది. సుప్రీం కోర్టు కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. తదనుగుణమైన చట్టం లేనందున పన్ను చెల్లించనవసరం లేదని కోర్టు నిర్ధారించింది. దానితో ప్రణబ్ ముఖర్జీ GAAR పేరుతో సవరణలకు పూనుకున్నారు.

ఇతర వివరాలను కింది ఆర్టికల్స్ లో చూడగలరు.

ప్రణబ్ సవరణలను వెనక్కి తిప్పడానికి మన్మోహన్ ప్రయత్నాలు?

వోడాఫోన్ పన్ను వివాదం: ప్రణబ్ నిర్ణయాన్ని అపహాస్యం చేస్తున్న చిదంబరం?

వోడాఫోన్ పన్ను కేసు: రాజీ చర్చలు విఫలం

బడ్జెట్ 2014-15: సామాన్యుడు కాదు సంస్కరణలే లక్ష్యం

GAAR లాంటి చట్టాలు తేవడం ఇండియా వరకే పరిమితం కాదు. వివిధ రూపాల్లో అమెరికా, ఐరోపా దేశాలు కూడా ఇటువంటి సౌకర్యాలను తమ చట్టాల్లో చేసుకున్నాయి. కెనడా, తైవార్ లాంటి దేశాలు GAAR లాంటి చట్టాలనే చేసుకున్నాయి.

మరీ ముఖ్యంగా 2007-08 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం అనంతరం పన్నుల ఎగవేతకు స్వర్గధామాలుగా మారిన దేశాలపై ఒత్తిడి తెచ్చి కంపెనీల వివరాలను సంపాదించాలని జి20 గ్రూపు సమావేశాల్లోనే నిర్ణయం జరిగింది. ఆ మేరకు స్విట్జర్లాండ్ లాంటి దేశాలపైన అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చి తగిన మార్పులు చేయించుకుంది. అదే పని ఇండియా లాంటి దేశాలు చేయబోతే వ్యాపార వ్యతిరేకం అంటూ గగ్గోలు పెట్టడం అమెరికా, ఐరోపాలకు పరిపాటి అయింది. పశ్చిమ దేశాల ఆర్ధిక, వాణిజ్య ఆధిపత్యం ఈ విధంగా మన పన్నుల చట్టాలను సైతం తమకు అనుకూలంగా మార్చుకునేలా చేయగలుగుతోంది.

Souce: Teluguvarthalu.com by V sekhar

భద్రాచల౦ దివ్యక్షేత్ర వివరాలు

ఇవి మీకు తెలుసా?
ఇన్ని ఉన్నాయా చూడాల్సినవి!
భద్రాచల౦ దివ్యక్షేత్ర వివరాలు.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం భద్రాచలం. ఇది పుణ్యక్షేత్రమే కాదు.. పుణ్యతీర్థం కూడా ఇక్కడ మహర్షులు నివసి౦చారు. ఇదే దండకారణ్యం. ఈ ప్రాంతంలోనే శ్రీరామచంద్రుడు
సీతాలక్ష్మణ సమేతుడై సంచరించాడు. నారథ మహర్షి ఈ భద్రాద్రి రామున్ని సేవించాడు. ఆరాధించి గానం చేశాడు. ఈ ప్రాంతమంతా రామాయణ రసరమస్య సన్నివేశాలతో పులకించిన దివ్యధాత్రి. ఎందరో మహాభక్తులకు ఆలవాలమైన భవ్యధరిత్రి భద్రగిరి.
పవిత్ర పావన గోదావరి..భద్రాద్రి రామునికి పాధ్యమైన పావన గౌతమి.. భద్రాచలాన్ని పుణ్యక్షేత్రంగా నేకాక పుణ్యతీర్థంగా కూడా విలసిల్లజేస్తోంది. గోదావరి తీరాన అందమైన
సోపానాలు. వాటి మధ్య శుభ ప్రధాత గోదావరిమాత. మరికొన్ని మెట్లు పైకెక్కితే ఆంజనేయస్వామి ఆశీర్వదిస్తూ కనిపిస్తాడు. ఆపైన వల్లి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం-అశ్వస్తవృక్షం పవిత్ర భావనను కలిగిస్తాయి. గోదావరిలో పవిత్రస్నానం చేసిన ప్రతి ఒక్కరూ అశ్వస్తవృక్షానికి ప్రదక్షిణలు, నవస్కారాలు చేస్తుంటారు. యోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం..గోదావరి నుంచి రామాలయానికి వెళ్లే మార్గంలో శ్రీయోగానంద లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయం ఉంది. భద్రాచలం యోగానంద లక్ష్మీనర్సింహుడు మానవనిర్మితుడు కాడు. మహర్షీప్రతిష్టుడు.దైవలోక నిర్మితుడు. ఈ నర్సింహస్వామి ధృవమూర్తి లభ్యం కావడంలోని అద్భుతమే ఇందుకు సాక్షిభూతం.

గోవిందస్వామి మఠం..
ఈ మఠం గోదావరి తీరాన కల్యాణ మండపానికి ఎదురుగా ఉంది. ఇక్కడ
సాదువులు నివసించేవారు. అందుకని సాదువుల మఠం అని కూడా
అనేవారు. గోవిందస్వామి అనే యోగి పుంగవుడు.. రామభక్తుడు
జీవసమాధిని పొందిన పవిత్రస్థలం ఈ మఠంలో ఉంది.

కల్యాణ మండపం..
ఏటా శ్రీరామనవమికి సీతారాముల కల్యాణ మహోత్సవం మహావైభవంగా
జరుగుతుంది. లక్షలాది భక్తులు కన్నుల పండువగా దర్శిస్తారు.
ఈ కల్యాణ మండపం అద్భుత శిల్పకళాఖండం అపురూప కమనీయ
దృశ్యం. ఇది రామాలయం సమీపంలోనే ఉంది.

వైకుంఠ ద్వారం..
ఆలయ ఉత్తర గోపురం నుంచి కిందకు మెట్లు ఉన్నాయి. అక్కడ
ఉత్తర వైకుంఠ ద్వారం ఉంది. 1974లో ఈ ద్వారం ఏర్పాటు చేశారు.
లక్షలాది మంది భక్తులు దర్శించడానికి వీలుగా ద్వారానికి ఎదురుగా
విశాలమైన కల్యాణ మండప ప్రాంగణం ఉంది. ఏటా వైకుంఠ ఏకాదశినాడు
వైకుంఠ రాముడు గరుఢ వాహనరూరుడై అశేష భక్తకోటికి
దర్శనమిస్తాడు.

మిథిలానగరం స్టేడియం..
వైకుంఠ ద్వారానికి అభిముఖంగా మిథిలానగరం (స్టేడియం) ఉంది.
వేలాదిమంది భక్తులు సీతారాముల కల్యాణం వీక్షించడానికి వీలుగా
రూ.38 లక్షల వ్యయంతో ఈ స్టేడియ నిర్మాణం జరిగింది. ఆనాటి
ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దీనికి శంకుస్థాపన చేశారు.

అన్నదాన సత్రం..
మిథిలాస్టేడియం సమీపంలో గోవిందస్వామి మఠానికి ఎదురుగా స్వామివారి
అన్నదానసత్రం ఉంది. భక్తులు సమర్పించిన విరాళాలతో ఈ సత్రాన్ని
దేవస్థానం నిర్వహిస్తోంది
.
శివాలయం..
రామాలయానికి దక్షిణంగా రంగనాయకుల గుట్ట కింద అతి ప్రాచీనమైన
శివాలయం ఉంది. రామునిపేరుతో రామలింగేశ్వరస్వామిగా ప్రసిద్ధికెక్కిన ఈ
శివమూర్తి యాత్రికులకు దర్శనీయులు.

కుసుమ హరినాథబాబా మందిరం..
ఇది కొండమీద ఉంది. శివాలయం నుంచి పైకి మెట్లు ఉన్నాయి. ఆ
మందిరంలో కుసుమకుమారి, హరినాథబాబాల పాలరాతి విగ్రహాలు ఉన్నాయి.

రామదాసు ధ్యాన మందిరం..
రంగనాయకస్వామి గుట్టపై రామదాసు స్మృతి చిహ్నంగా రామదాసు ధ్యాన
మందిరం నిర్మించబడింది. రామదాసు శిలావిగ్రహం ద్వారంలో
దర్శనమిస్తుంది. విశాలమైన ధ్యాన మందిరం ఒక అపురూప కట్టడం.
మందిరపు గోడలన్నీ రామదాసు కీర్తనలు, దాశరథి శతకం చెక్కబడిన
శిలాఫలకాలతో నిండిఉన్నాయి. వాగ్గేయ కారోత్సవాలు ఇక్కడ నిర్వహించేవారు.
యాత్రికుల సంఖ్య పెరగడం వల్ల అక్కడ ఇప్పుడు జరగడంలేదు.
కల్యాణ మండపం ఆవరణలో వాగ్గేయ కారోత్సవాలు జరిపిస్తున్నారు.
భద్రాద్రి పురవిశేషాల్లో ఇది తప్పక దర్శించవల్సిన కట్టడం. ఈ
ప్రదేశంలోనే కుటీరం నిర్మించుకొని రామదాసు శేషజీవితాన్ని గడిపి
తరించినట్లుగా జనస్మృతి ఉంది.

రంగనాయకస్వామి ఆలయం..
హరినాథబాబా మందిరం నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్తే రంగనాయకస్వామి
దేవాలయం కనపడుతుంది. రంగనాథుడు శేష పర్యంకంపై పవళించి
ఉంటాడు. ఇది కూడా రామాలయ పరిధిలోనేదే. ఏటా కల్యాణోత్సవాలు,
తిరువీధిసేవలు జరిపిస్తారు.

అంబాసత్రం..
రామాలయం ముందర నాలుగైదు మెట్లు దిగి దక్షిణంవైపు మెట్లు
దిగితే అంబాసత్రం ఉంటుంది. పమిడి గంటం వెంకటరమణయ్య అనే
మహనీయుడు అన్నపూర్ణాదేవిని ప్రతిష్టించి అన్నదాన సత్రం
నిర్వహించాడు. తూము నర్సింహదాసుగారు ఆరాధించిన శ్రీసీతారామలక్ష
్మణుల దివ్యమూర్తులను ఇక్కడ దర్శించవచ్చు.

గోవిందరాజస్వామి ఆలయం..
రాజవీధిలో విశ్రాంతి మండపం నుంచి కొంత దూరం సాగితే
గోవిందరాజస్వామి దేవాలయం కనిపిస్తుంది. భద్రాద్రిరాముడు సీతాలక్ష్మణ
సమేతుడై తిరువీధిసేవకు బయలుదేరి ఊరేగింపుగా వస్తూ దారిపొడవునా
హారతులు అందుకుంటూ ఈ గోవిందరాజస్వామి ఆలయంలో కొద్దిసేపు
విశ్రమిస్తాడు.

దాసాంజనేయస్వామి..
తాతగుడికి అభిముఖంగా దాసాంజనేయస్వామి ఆలయం ఉంది.
శ్రీసీతారామలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు తిరువీధిసేవకు
వేంచేసేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు తనివితీరా దర్శించుకుంటాడు
దాసాంజనేయుడు. ప్రతీ మంగళవారం అనేకమంది భక్తులు ఈ
ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు.

అభయాంజనేయస్వామి దేవాలయం..
గోదావరి వంతెన దాటగానే రామభక్తులకు అభయాంజనేయస్వామి స్వాగతం
పలుకుతుంటాడు. మరో పక్క అయ్యప్పస్వామి ఆలయం కూడా ఉంది.
అభయాంజనేయస్వామి పార్కు..
భద్రాచలం బ్రిడ్జీ దాటగానే అక్కడ నిలువెత్తూ ఆంజనేయస్వామి భద్రాచలం
యాత్రికులకు వచ్చేవారికి ఆహ్వానం పలుకుతున్నట్లు కనిపిస్తారు.
ఈ పార్కునే అభయాంజనేయస్వామి పార్కు అని పిలుస్తారు. ఇక్కడ
పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా గడుపుతారు.

ఇతర దేవాలయాలు..
పట్టణంలో ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వరకాలనీలో
వేంకటేశ్వర ఆలయం ఉంది. ఇంకా కోదండరామాలయం, గాయత్రి ఆలయం,
సాయిబాబా ఆలయం, శివానందస్వామి మందిరం, రాజరాజేశ్వరి ఆలయం,
కనకదుర్గ ఆలయం, ఈశ్వరమ్మ ఆలయం భద్రాద్రి పురవీధుల్లో
కనిపిస్తాయి.

శ్రీరామాలయ విశేషాలు..
శ్రీసీతారామచంద్రస్వామి ప్రభువు ఆలయం నాలుగు దిక్కుల్లో
నాలుగు గోపురాలు, నాలుగు ద్వారాలు ఉన్నాయి. పడమటివైపు ఎత్తైన
రాజగోపురం, ఏ వైపు నుంచి ఎంత దూరం చూసినా
దర్శనమిస్తుంది. తూర్పువైపు నూతనంగా నిర్మించిన మండపాలతో
కూడిన సోపానాలు ఉన్నాయి. భక్తులు ఆ మెట్లపై నుంచి ఆలయంలోకి
ప్రవేశిస్తారు. ముందుగా శాసన స్తంభాలు దర్శించవచ్చు. ఆ పక్కనే
భద్రుని శిరస్సు, భద్రుని దేవాలయం సేవించవచ్చు. గర్భాలయంపై
రామదాసు వారికి గోదావరిలో లభించిన సుదర్శనచక్రం ప్రకాశిస్తూ
ఉంటుంది. చుట్టు పరిక్రమిస్తూ ఆళ్వార్ల సన్నిధులను ప్రాకార
మండపాన్ని దర్శించుకోవచ్చు. స్వామివారి వాహనాలు వెండి రథం
కనులవిందు చేస్తాయి. రాజగోపురానికి ఎదురుగా విశాలమైన ముఖ
మండపం, ద్వజస్తంభం, రాజగోపురానికి ఇరువైపులా లక్ష్మీతాయారుల
సన్నిధి, అమ్మవారి ఆభరణాలు కొన్ని అపూర్వ చరిత్ర విశేషాలు, భద్రపరిచిన
రుష్యముఖం, ఆండాల్ సన్నిధి దర్శనీయమై ఉన్నాయి. అక్కడే
భక్తరామదాసు విగ్రహం చరిత్రను జ్ఞాపకం చేసుకుంటుంది.
రాజగోపురం కింద నుంచి మెట్లు దిగితే ఆంజనేయస్వామి సన్నిధి
కనపడుతుంది. అక్కడే స్వామివారి విక్రయశాలలు, శ్రీపెద్దజీయర్స్వామివారు
ప్రతిష్టించిన శ్రీరామకోటి క్రతు స్తంభాలు ఉన్నాయి. పడమరగా గోదావరి
తీరానికి అందమైన సోపానాలు ఉన్నాయి. అక్కడి నుంచి దక్షిణంగా మెట్లు
దిగితే స్వామివారి రామాయణ భాగవత కథల చిత్రపటాలతో చాలా విశాలమైన చిత్రకూట
మండపం ఉంది. ఈ మండపంలో దేవస్థానం సంస్కృత పాఠశాల కూడా
నిర్వహిస్తోంది.

భారతీయతకు ప్రతీక… కుంకుమ

భారతీయతకు ప్రతీక… కుంకుమ

ఆస్తికుల ఆస్తి కుంకుమ
నుదుట ఎర్రటి కుంకుమ పెట్టుకోవడం అనేది హిందూ సంప్రదాయంలో ఒక భాగం. గతంలో హిందువుల్లో ఏ కులం వారైనాసరే తప్పకుండా నుదుటన కుంకుమ ధరించేవారు. ముఖ్యంగా శైవులు, వైష్ణవులైతే కుంకుమ ధరించడం తప్పనిసరి.. అలా కుంకుమ ధరించడం గొప్పదనంగా భావించేవారు. ఆస్తికుల ముఖం మీద చెరగని ఆస్తిగా కుంకుమ భాసించేది. ఈ ఆధునిక యుగంలో తప్ప శతాబ్దాలుగా ప్రతి ఒక్క హిందువు ముఖం మీద కుంకుమ తప్పకుండా వుండేది. అది కేవలం ఆచారంగా మాత్రమే కాకుండా అలంకారంగా కూడా వర్ధిల్లింది. హరిచందనాన్ని, మంచి గంధాన్ని, విభూతిని, ఎర్రటి కుంకుమను నుదుటన ధరించడం హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ వచ్చింది. సృష్టిలో మొదటిరంగు ఎరుపు కాబట్టి కుంకుమ ఎర్రటి రంగులో ఉంటుందట. ఎరుపురంగు లక్ష్మీప్రదమని కూడా అంటారు.
నాడులు కలిసే కీలక ప్రదేశంలో…
మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే నాడులు సక్రమంగా పనిచేయాలి. శరీరంలో రెండు ముఖ్యమైన నాడులు వుంటాయి. వాటిలో ఒకటి ‘ఇడ’ రెండోది ‘పింగళ’. ఈ రెండు నాడులూ నుదుటి వద్ద కలుస్తాయి. అంటే శరీరంలోని నాడులన్నింటికీ అనుసంధానం నుదుటన వుందన్నమాట. ఈ ప్రదేశాన్ని ‘సుషుమ్న’ నాడిగా పిలుస్తారు. ఇక్కడ కుంకుమగానీ, గంధం గానీ, విభూదిగానీ ధరించడం వల్ల నాడుల పనితీరు సక్రమంగా వుంటుందన్న అభిప్రాయాలు వున్నాయి. అలాగే కుంకుమ ధరించడం వల్ల దృష్టిదోషం తగలదట. కుంకుమ ధరించిన వ్యక్తులకు ఎదుటి వ్యక్తులు మానసికంగా లొంగిపోతారట. అలాగే కుంకుమకున్న ఎర్రటి రంగు మనలో మనోశక్తి, త్యాగనిరతి, నిర్భయత్వం, పరోపకార గుణాన్ని పెంపొందిస్తాయన్న అభిప్రాయాలు వున్నాయి.
పవిత్రతకు చిహ్నం
పురుషులు కుంకుమ ధరించడం పవిత్రతకు, ఆస్తికత్వానికి, ధార్మికత్వానికి సంకేతంగా భావిస్తారు. అదే స్త్రీలకయితే పై అంశాలకు తోడు సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా కూడా భావిస్తారు. అనాది నుంచి హిందువులకు ప్రధాన అలంకార ప్రక్రియ కుంకుమ పెట్టుకోవడం అనే అభిప్రాయాలు కూడా వున్నాయి. ఈ విషయాన్ని కొన్ని గ్రంథాల్లో కూడా పేర్కొన్నారు. కుంకుమను భారతీయతకు చిహ్నంగా భావిస్తారు. దూరదర్శన్‌లో చూసే బధిరుల వార్తల్లో ‘ఇండియా’ అనే సందర్భం వచ్చినప్పుడు ఆ న్యూస్‌రీడర్ నుదుటన కుంకుమ పెట్టుకునే ప్రదేశంలో మధ్యవేలుని చూపిస్తుంది. అది కుంకుమకి, భారతదేశానికి ఉన్న బలీయమైన బంధాన్ని సూచిస్తుంది. ఈమధ్యకాలంలో పురుషులు కుంకుమ పెట్టుకోవడం మానేశారు. కొంతమంది మహిళలు కూడా మానేశారు. ఈ ధోరణి ఎక్కడకి దారితీస్తుందోనన్న ఆందోళనను సంప్రదాయ వాదులు వ్యక్తం చేస్తూ వుంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద వుంటుంది. హిందువులు తమ సంప్రదాయానికి దూరంగా వెళ్ళిపోవడం, కుంకుమను విస్మరించడం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.